Diwali celebrations in Hyderabad: దీపావళి పర్వదినం సందర్భంగా భాగ్యనగరం పండుగ శోభతో వెలిగిపోతోంది. కాకరపూల వెలుగులు, టపాసుల ‘ఢాం ఢాం’ శబ్దాలతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. దీపావళి అంటే పటాకుల మోత మోగించాల్సిందేనన్నట్టుగా అబిడ్స్, బేగంబజార్ ప్రాంతాల్లోని బాణసంచా దుకాణాలకు నగరవాసులు పోటెత్తారు.
అందుబాటు ధరల్లో బాణసంచా: వివిధ రకాలైన పటాకులు, క్రాకర్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. గతేడాది కంటే ఈసారి ధరలు తక్కువగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది అన్ని వస్తువుల ధరలు వినియోగదారులకు అందుబాటు ధరల్లోనే ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. బాణసంచా దుకాణాల మాదిరిగానే స్వీట్ దుకాణాలూ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
Also Read:https://teluguprabha.net/telangana-news/sadar-celebrations-chief-guest-cm-revanth-reddy/
కోకాపేటలో కనువిందు చేసిన బాణసంచా ప్రదర్శన: కోకాపేటలో దీపావళి సంబురాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గోల్డెన్ మైల్ రోడ్డులో బాణసంచా ప్రదర్శన అందరినీ కనువిందు చేసింది. అత్యంత ఎత్తైన నివాస భవనాలుగా పేరుగాంచిన ఎస్‌ఏఎస్ క్రౌన్, ఎస్‌ఏఎస్ ఇన్‌ఫ్రాలో నిర్వాహకులు 236 మీటర్ల ఎత్తులో ఈ ప్రదర్శనను నిర్వహించి మరోసారి అద్భుతాన్ని సృష్టించారు. ఆకాశంలో రంగురంగుల కాంతులు విరజిమ్ముతూ వెలిగిన ఈ బాణసంచా వెలుగులు స్థానికులను విశేషంగా అలరించాయి. ఈ ప్రదర్శన హైదరాాబాద్ నగరానికే తలమానికంగా నిలిచింది.
పూల మార్కెట్‌లో పండగ సందడి: దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పూల మార్కెట్లు, బాణసంచా దుకాణాల్లో సందడి వాతావరణం నెలకొంది. నగరంలోని ఏకైక హోల్‌సేల్ మార్కెట్‌గా నిలిచిన గుడిమల్కాపూర్ పూల మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. సరసమైన ధరలకే పూలు లభిస్తుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చి కొనుగోలు చేశారు. బయట మార్కెట్‌తో పోలిస్తే ఇక్కడ తక్కువ ధరలకే పూలు దొరుకుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే ఈ మార్కెట్, దీపావళి పండుగ వేళ మరింత రద్దీగా మారింది.


