Musi River Rejuvenation Project: చినుకుపడితే చిగురుటాకులా వణికిపోతున్న హైదరాబాద్ మహానగరానికి శాశ్వత అభయం లభించనుందా..? గంటల వ్యవధిలో కురిసే కుండపోత వర్షాలకు అతలాకుతలమవుతున్న జనజీవనానికి తెరపడనుందా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వరద నీటి నిర్వహణకు పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు ‘మూసీ పునరుజ్జీవనం’ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఇంతకీ ఈ బృహత్తర ప్రణాళిక స్వరూపమేంటి..? దీని ద్వారా భాగ్యనగరం రూపురేఖలు ఎలా మారబోతున్నాయి..? ట్రాఫిక్ కష్టాలకు కూడా ఈ ప్రణాళికతో చెక్ పెట్టవచ్చా..?
వరదపై సీఎం సమీక్ష.. తక్షణ కార్యాచరణకు ఆదేశం: గురువారం రాత్రి హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం, తదనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేవలం నాలుగు గంటల వ్యవధిలో కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడంతో నగరం స్థంభిచిపోయిన కారణాలపై ఆరా తీశారు. జూన్ నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో సాధారణం కన్నా 16% అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
ప్రస్తుత డ్రైనేజీ వ్యవస్థ 5 సెంటీమీటర్ల వర్షాన్ని కూడా తట్టుకునేలా లేదని, 20 సెంటీమీటర్ల వర్షం వచ్చినా తట్టుకునేలా వ్యవస్థలను ఆధునీకరించాలని సీఎం స్పష్టం చేశారు. రాబోయే 100 సంవత్సరాలకు సరిపడా తాగునీరు, వరద నీరు, డ్రైనేజీ, ట్రాఫిక్ వ్యవస్థల అవసరాలను అంచనా వేసి, అందుకు తగ్గ ప్రణాళికలను రూపొందించాలని అధికారులు ఆదేశించారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/hyderabad-bandlaguda-prostitution-racket-bangladesh-minor-girl-2025/
పరిష్కారం ఒక్కటే.. మూసీ పునరుజ్జీవనం: లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా, వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఉండాలంటే మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును తక్షణమే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సమగ్ర అనుసంధానం: హైదరాబాద్ పరిధిలో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించడమే కాకుండా, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి వరద నీరు మూసీలోకి చేరేలా చూడాలని సూచించారు.
చెరువులు-నాలాల జోడింపు: హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మీర్ ఆలం ట్యాంకు సహా నగరంలోని ప్రతి చెరువు, కుంటను నాలాల ద్వారా మూసీతో అనుసంధానించాలని ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల వెడల్పు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.
ALSO READ:https://teluguprabha.net/telangana-district-news/hyderabad/ghmc-storm-water-master-plan-geo-tagging/
స్వచ్ఛమైన నీటి ప్రవాహం: డ్రైనేజీల నుంచి వచ్చే మురుగునీటిని ఎస్టీపీల (మురుగునీటి శుద్ధి ప్లాంట్లు) ద్వారా శుద్ధి చేసి, స్వచ్ఛమైన నీరు మాత్రమే మూసీలో ప్రవహించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, ఇతర అవసరాలకు ట్యాంకర్ల ద్వారా వినియోగించుకోవచ్చని సూచించారు.
ట్రాఫిక్‌కూ ప్రత్యేక ప్రణాళిక: వరద నిర్వహణతో పాటే నగరంలోని తీవ్రమైన ట్రాఫిక్ సమస్య పరిష్కారంపైనా సీఎం దృష్టి సారించారు. ముఖ్యంగా పాతనగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పాదచారుల జోన్: చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి పరిసరాల్లో ‘పాదచారుల జోన్’ ఏర్పాటు చేసి, వాహనాల రద్దీని తగ్గించాలని సూచించారు.
మల్టీ లెవెల్ పార్కింగ్: ఈ ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్ల ఏర్పాటుకు వెంటనే కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


