హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 12న హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శోభాయాత్ర ఉదయం 11 గంటలకు గౌలిగూడలోని శ్రీ రామమందిరం వద్ద ప్రారంభమై, పలు ప్రధాన రహదారుల గుండా సాగుతూ తాడ్‌బండ్‌లోని శ్రీ హనుమాన్ మందిరం వద్ద ముగియనుంది.
పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, రామ్‌కోఠి, కాచిగూడ, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్‌నగర్, గాంధీనగర్ వైశ్రాయ్ హోటల్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, సీజీవో టవర్స్, బన్సీలాల్‌పేట, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయిని మహంకాళి దేవాలయం, ఓల్డ్ రామ్‌గోపాల్‌పేట, పారడైజ్, సీటీవో జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపిరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ ద్వారా తాడ్‌బండ్ హనుమాన్ ఆలయాన్ని చేరుకోనుంది.
ఈ శోభాయాత్ర నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ సమయంలో ఈ మార్గాల్లో ప్రయాణించాలనుకునే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లు ఎంచుకోవాలని సూచించారు. లక్డీకాపూల్ నుండి సికింద్రాబాద్ స్టేషన్ లేదా ఉప్పల్ వైపు వెళ్లే వారు వీవీ స్టాచ్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్ ఫ్లై ఓవర్, ప్రకాశ్‌నగర్ ఫ్లై ఓవర్, పారడైజ్ ఫ్లై ఓవర్ మార్గాన్ని ఉపయోగించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా జరగనున్న శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లను భారీగా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. భక్తుల భద్రతతో పాటు ట్రాఫిక్ సౌకర్యాల పరిరక్షణకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. నగరవాసులు సహకరించాలని, శాంతియుతంగా హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు.