Rental housing demand in Hyderabad : ఒకప్పటి కుగ్రామం… నేటి ఐటీ ప్రపంచం. చీకటి పడితే బయటకు రావడానికి భయపడే మాదాపూర్, ఇప్పుడు 24 గంటలూ వెలుగులు విరజిమ్మే మహానగరంగా మారిపోయింది. అద్దాల మేడలు వెలిశాయి… కానీ వాటిలో అడుగుపెట్టాలంటే అద్దెలు చుక్కలు చూపిస్తున్నాయి. సింగిల్ బెడ్‌రూమ్‌కు రూ.20 వేలు, 3 బెడ్‌రూమ్‌లకు రూ.50 వేలు చెల్లించాల్సిన పరిస్థితి. అసలు ఈ అద్దెల పెరుగుదలకు కారణమేంటి..? ఫ్యామిలీల కన్నా బ్యాచిలర్లకే యజమానులు ఎందుకు మొగ్గు చూపుతున్నారు..? ‘కట్టుబట్టలతో వచ్చేయండి’ అంటున్న ఫర్నిష్డ్ ఫ్లాట్ల కథేంటి..?
కుగ్రామం నుంచి కార్పొరేట్ హబ్ వరకు: హైటెక్‌సిటీ ఏర్పాటుతో మాదాపూర్ రూపురేఖలే మారిపోయాయి. బహుళజాతి సంస్థల రాకతో ఈ ప్రాంతం ఐటీ ఉద్యోగులకు చిరునామాగా మారింది. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ పరిసరాల్లో వేలాది ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు ఉండటంతో నివాస గృహాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో, గత ఐదేళ్లలో ఇళ్ల అద్దెలు ఏకంగా 50 శాతానికి పైగా పెరిగాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఎక్కడైనా ‘టు-లెట్’ బోర్డు కనిపిస్తే, నాలుగైదు రోజుల్లోనే ఆ ఇల్లు నిండిపోతోంది.
అద్దెల మోత మోగుతోందిలా….
1 BHK: ఒకప్పుడు రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య పలికిన సింగిల్ బెడ్‌రూమ్ ఇంటి అద్దె, ఇప్పుడు రూ.20 వేల నుంచి రూ.25 వేలకు చేరింది.
2 BHK: నాలుగేళ్ల క్రితం రూ.23 వేలు ఉన్న 2 బెడ్‌రూమ్‌ల ఫ్లాట్ అద్దె, ప్రస్తుతం రూ.35 వేలు దాటింది.
3 BHK: ఖాజాగూడ వంటి ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలలో 3 బెడ్‌రూమ్‌ల ఇంటికి నెలకు రూ.50 వేలు వసూలు చేస్తున్నారు.
ఫ్యామిలీలు వద్దు… బ్యాచిలర్లే ముద్దు : సాధారణంగా నగరంలో బ్యాచిలర్లకు ఇల్లు దొరకడం కష్టం. కానీ మాదాపూర్ ప్రాంతంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. ఇక్కడి యజమానులు కుటుంబాల కన్నా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైన బ్యాచిలర్లకే ఇళ్లు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. దీనికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి:
అద్దె భారం: ఒక ఫ్లాట్‌లో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు కలిసి ఉండటంతో అద్దెను సులభంగా పంచుకుంటారు.
తక్కువ వినియోగం: వీరు ఉదయం ఆఫీసులకు వెళ్లి, రాత్రికి ఆలస్యంగా తిరిగి వస్తారు. దీంతో నీళ్లు, ఇతర వనరుల వినియోగం తక్కువగా ఉంటుందని యజమానుల భావన.
‘కట్టుబట్టలతో వచ్చేయండి చాలు’ : నగరానికి కొద్ది నెలలు లేదా ఒకటి, రెండు సంవత్సరాల పాటు తాత్కాలికంగా వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ‘ఫర్నిష్డ్ ఫ్లాట్ల’ సంస్కృతి పెరిగింది. ఈ ఇళ్లలో ఫర్నీచర్, ఏసీలు, ఫ్రిజ్, టీవీ, వాటర్ ఫిల్టర్ వంటి గృహోపకరణాలన్నీ యజమానే సమకూరుస్తారు. అద్దె కాస్త ఎక్కువగా ఉన్నా, ఎలాంటి సామాను కొనాల్సిన అవసరం లేకుండా కట్టుబట్టలతో ఇంట్లోకి దిగిపోవచ్చు. ఈ సౌలభ్యం కారణంగా ఐటీ ఉద్యోగులు వీటిపై అధిక ఆసక్తి చూపుతున్నారు.


