Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్MMTS Services: రూ.20తో గమ్యం.. కానీ పట్టాలెక్కని ప్రయాణం!

MMTS Services: రూ.20తో గమ్యం.. కానీ పట్టాలెక్కని ప్రయాణం!

Hyderabad public transport issues : హైదరాబాద్ మహానగరంలో ప్రయాణం రోజురోజుకూ భారంగా మారుతోంది. ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఆకాశాన్నంటుంటే, క్యాబ్ చార్జీలు జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రూ.20 నామమాత్రపు ఛార్జీతో నగరాన్ని చుట్టిరావొచ్చంటే నమ్ముతారా? అవును, ఇది నిజం! కానీ, ఇంత చౌకైన ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నా, ప్రయాణికులు అటువైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదు? నిర్వహణ ఖర్చులు కూడా రానంతగా ప్రయాణికులు ఎందుకు తగ్గిపోయారు? రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ఎంఎంటీఎస్‌ను అస్తవ్యస్తంగా మార్చిందా?

- Advertisement -

హైదరాబాద్ నగరవాసులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రజా రవాణా వ్యవస్థ ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్). ఆర్టీసీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.15 నుంచి గరిష్ఠంగా రూ.80 వరకు ఉండగా, ఎంఎంటీఎస్ రైళ్లలో కేవలం రూ.20 చెల్లించి సుదూర ప్రాంతాలకు సైతం సులభంగా చేరుకోవచ్చు. పెరిగిన బస్సు ఛార్జీల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచి ప్రయాణికులను ఆకర్షించాల్సింది పోయి, ఉన్న సర్వీసులను కూడా సమర్థంగా నడపలేకపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొవిడ్‌ దెబ్బ.. కోలుకోని సేవలు: ఒకప్పుడు నగర రవాణాలో ఎంఎంటీఎస్ కీలకపాత్ర పోషించింది. కొవిడ్‌కు ముందు నగరంలో రోజుకు 120 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తుండగా, సగటున 1.5 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేవారు. కానీ, కొవిడ్ తర్వాత రైల్వే శాఖ సర్వీసుల సంఖ్యను 86కి కుదించింది. దీంతో ప్రయాణికుల సంఖ్య దారుణంగా 50 వేలకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం సమయపాలన లేకపోవడం, రైళ్లు ఆలస్యంగా నడవటంతో ప్రయాణికులు ఆర్టీసీ, మెట్రో వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.

అస్తవ్యస్త నిర్వహణ.. ఆర్థిక నష్టాలు: ప్రస్తుతం రైల్వే శాఖ అనుసరిస్తున్న విధానాలు ‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు’ ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్ లేని మార్గాల్లో సైతం గంటకు మూడు సర్వీసులను నడుపుతున్నారు.
ఉదాహరణకు, మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో ఉదయం గంట వ్యవధిలోనే 3 సర్వీసులు నడుస్తున్నాయి. మొత్తం 30 బోగీలతో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నా, వాటిలో ప్రయాణించే వారి సంఖ్య 200 కూడా దాటడం లేదు. కొన్నిసార్లు ఒక్కో బోగీలో పట్టుమని పది మంది కూడా ఉండటం లేదు. ఇలా 10 నుంచి 12 బోగీలతో ఖాళీ రైళ్లను నడపడం వల్ల నిర్వహణ ఖర్చులు కూడా రాక రైల్వే శాఖ నష్టాలను మూటగట్టుకుంటోంది.

ప్రయాణికుల సూచన ఇదే: రైల్వే శాఖ ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా సర్వీసులను సర్దుబాటు చేయాలని కోరుతున్నారు. పదుల సంఖ్యలో బోగీలతో ఖాళీగా నడిపే బదులు, ఆరు బోగీలతో రైళ్లను ఏర్పాటు చేసి ట్రిప్పుల సంఖ్య పెంచితే అటు రైల్వేకు ఆదాయం, ఇటు ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో కిక్కిరిసిపోతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని, చర్లపల్లి, మల్కాజ్‌గిరి మీదుగా సికింద్రాబాద్, ఉందానగర్ వంటి మార్గాల్లో సర్వీసులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad