Hyderabad Old City Crime Wave: భాగ్యనగరం పాతబస్తీలో నెత్తుటి మరకలు కలకలం రేపుతున్నాయి. ఒకప్పటి రౌడీయిజానికి కేరాఫ్‌గా నిలిచిన గల్లీల్లో ఇప్పుడు గడగడ పుడుతోంది. సింహాల్లా తిరిగిన రౌడీ షీటర్లు ఇప్పుడు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు, ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో తెలియక వణికిపోతున్నారు. కొందరు ఇప్పటికే ప్రత్యర్థుల కత్తులకు బలవగా, మరికొందరు ఆసుపత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దాడి ఈ భయాలను రెట్టింపు చేసింది. అసలు పాతబస్తీలో ఏం జరుగుతోంది…? ఈ వరుస దాడుల వెనుక ఉన్నది పాత కక్షలా..? లేక కొత్త ఆధిపత్య పోరా..?
అసలేం జరిగిందంటే : రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబీర్‌పురా దర్వాజా వద్ద ఖిజార్ యాకుబీ అనే అనుమానిత రౌడీ షీటర్‌పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యాకుబీ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, ఈ దాడితో పాతబస్తీలోని ఇతర రౌడీ షీటర్లలో వణుకు మొదలైంది. ఇది ఆధిపత్య పోరులో భాగమా లేక వ్యక్తిగత కక్షల పర్యవసానమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత కొంతకాలంగా పాతబస్తీలో ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. ఫలక్‌నుమాకు చెందిన రౌడీ షీటర్ మాస్ యుద్ధీన్‌ను కొందరు దుండగులు డబీర్‌పురా ఫ్లైఓవర్ వద్ద దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మరో దాడి జరగడం గమనార్హం.
కాలాపత్తర్ ప్రాంతంలో ఆధిపత్యం కోసం రెండు గ్యాంగుల మధ్య పోరు, ప్రతీకార హత్యలు నిత్యకృత్యంగా మారాయని పోలీసు వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. ఒక వర్గాన్ని మరొక వర్గం దెబ్బతీయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయని, ఈ క్రమంలోనే దాడులు, హత్యలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది.
రంగంలోకి దిగిన పోలీసులు : రౌడీ షీటర్లపై వరుస దాడుల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. పాతబస్తీలో భద్రతను కట్టుదిట్టం చేసి, కీలక ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. తాజాగా జరిగిన ఖిజార్ యాకుబీ దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలు, గ్యాంగ్ వార్ అనే రెండు ప్రధాన కోణాల్లో విచారణ జరుపుతున్నారు. నిందితుడిని గుర్తించేందుకు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నేర చరిత్ర ఉన్న పాత నేరస్థుల కదలికలపై నిఘా పెట్టి, వారిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. పాతబస్తీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.


