Paradise Road 9Months Close: హైదరాబాద్ నగర ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన జారీ చేశారు. సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి బాలంరాయ్ వరకు ఉన్న NH-44 జాతీయ రహదారిపై రాకపోకలను రేపటి నుంచి సుమారు తొమ్మిది నెలలపాటు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
మూసివేతకు కారణం: ప్యారడైజ్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి డైరీ ఫార్మ్ వరకు ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల వేగవంతం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. మూసివేత నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారు. రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుంచి వచ్చే వాహనదారులు అన్నానగర్, బాలంరాయ్, తాడ్బండ్ మీదుగా వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రాబోయే నెలల పాటు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. వాహనదారులు ప్రయాణాలను ముందుగా ప్లాన్ చేసుకోవాలని కోరారు.ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


