Hydra demolishes illegal structures: హైదరాబాద్ నగర సమీపంలోని గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో.. ఆదివారం ఉదయం హైడ్రా రంగంలోకి దిగింది. సుమారు రూ. 4,500 కోట్ల విలువైన ఈ భూముల్లో.. అక్రమంగా నిర్మించిన కట్టాడాలను హైడ్రా కూల్చివేసింది. సర్వే నంబర్ 307,342,329/1,348, 397లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేస్తుండగా.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజుల రామారంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఐసీ, హెచ్‌ఎండీఏ, మరియు హౌసింగ్‌బోర్డు వంటి ప్రభుత్వ విభాగాలకు గతంలో కేటాయించిన భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఈ విభాగాల నిష్క్రియాత్మకతను ఆసరాగా తీసుకుని కొందరు అక్రమార్కులు గత మూడు, నాలుగు సంవత్సరాలుగా పథకం ప్రకారం ఈ భూములను కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది.
Also Read:https://teluguprabha.net/telangana-news/ministers-advise-revanth-reddy-on-local-body-elections/
రూ.4500 కోట్ల విలువైన భూముల అన్యాక్రాంతం: ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ రూ. 40-50 కోట్లు ఉండటంతో, మొత్తం 103 ఎకరాల భూమి అన్యాక్రాంతం కావడం గమనార్హం. చిన్న చిన్న నేతలు ఈ భూములను ఆక్రమించారు. వాటిలో 60 నుంచి 70 గజాల ఇళ్లను నిర్మించి.. ఒక్కో ఇంటిని రూ. 10 లక్షలకు విక్రయిస్తున్నారు. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, చింతల్ పరిసర ప్రాంతాల్లోని కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఈ ఇళ్లను అమ్ముతున్నారు. అధికారుల అండతో ఈ అక్రమ ఇళ్లకు కరెంటు, నల్లా కనెక్షన్లు కూడా వచ్చాయి. కబ్జాదారులకు రెవెన్యూ, విద్యుత్ అధికారుల నుంచి సహకారం లభిస్తుండటంతో వారి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
స్థానికుల ఆందోళన: కూల్చివేతలకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేపట్టారు. తాము డబ్బులు పెట్టి ఇళ్లను కొనుక్కున్నామని వాపోతున్నారు. తమకు ఇళ్లను అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిన్న పిల్లలతో కలిసి జేసీబీ వాహనాలకు అడ్డుగా నిలబడ్డారు. ఈ అక్రమాలను అడ్డుకోలేని ప్రభుత్వ యంత్రాంగంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


