HYDRAA demolishes Illegal Constructions: హైదరాబాద్ సమీపంలోని గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కబ్జాదారులు అక్రమంగా నిర్మించిన కట్టడాలపై పంజా విసిరింది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల వందల ఎకరాల్లో భూములను కాపాడిన హైడ్రా.. తాజాగా ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది.
హైకోర్టును ఆశ్రయించిన బాధితులు: హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. కబ్జాలపై సోమవారం తెల్లవారుజామున పంజా విసిరింది. అక్రమ నిర్మాణాలను తొలగించింది. ఈసారి వీకెండ్ లో కాకుండా సోమవారం ఉదయమే కూల్చివేతలు చేపట్టింది. గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్‌లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు ఆక్రమణలపై పలువురు బాధితులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. లే ఔట్‌లోని రహదారులు, ఆ పక్కనే ఉన్న తమ ప్లాట్లు, పార్కులు సరిహద్దులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని పలువురు బాధితులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదేమని అడిగితే తమపై దాడి చేసేవారని బాధితులు పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-district-news/hyderabad/puppy-yoga-hyderabad-trend/
హైకోర్టు ఆదేశాల మేరకే కూల్చివేతలు: బాధితులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం వారం క్రితం విచారణ చేపట్టింది. హైకోర్టు గత మంగళవారం సంధ్యా శ్రీధర్ రావు పై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని హైకోర్టు సీరియస్‌గా పరిగణించింది. అంతే కాకుండా బాధితుల ఫిర్యాదులన్నీ విన్నాక జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ఇప్పటికే రహదారుల పునరుద్ధరణకు తాము హైడ్రాకు సూచించామని బాధితులకు తెలిపింది. అందులోని ప్లాట్ల యజమానులకు అండగా హైకోర్టు ఉంటుందని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధైర్యం చెప్పారు. లే ఔట్‌లోని రహదారులను, పార్కులను పునరుద్ధరించాలని హైడ్రాకు హైకోర్టు మరోసారి పేర్కొంది. ఫైనల్ హియరింగ్ కోసం ఈనెల 18వ తేదీకి కేసును హైకోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా సోమవారం ఉదయమే గచ్చిబౌలిలో కూల్చివేతలు చేపట్టింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లో అక్రమ కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేసింది. అనుమతులు లేని షేడ్స్ నిర్మాణాలను సైతం హైడ్రా సిబ్బంది తొలగించారు.

