Fake Pregnancy In Hyderabad: సరోగసీ పేరుతో హైదరాబాద్‌లో మరోసారి పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని, సరోగసీ పేరుతో డబ్బు వసూలు చేసి పుట్టిన పిల్లలను ఇతరులకు ఇచ్చిన ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటివరకు 17 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతను ఐదు రోజుల కస్టడీలోకి తీసుకుని విచారించగా, కస్టడీ ముగిశాక చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈ కేంద్రం అధికారికంగా డాక్టర్ విద్యుల్లత పేరుతో నమోదు అయి ఉన్నా, అసలు నిర్వహణ డాక్టర్ నమ్రతే చూస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సరోగసీ చికిత్సల్లో ఉపయోగించే అండకణాలు, వీర్యకణాలను సేకరించేందుకు ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ సదానందం కూడా ఈ ల్యాబ్ కార్యకలాపాల్లో భాగంగా ఉన్నట్టు సమాచారం. అదుపులో ఉన్న మరికొంత మందిని కూడా అధికారులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించిన డాక్టర్ నమ్రత, ఇది విశాఖలో జరిగిన కేసు అని, బాధితులుగా ఉన్నవాళ్లకు ఇక్కడి పరిచయాలు ఉన్నాయని చెబుతూ కేసును మళ్లించేందుకు ప్రయత్నించారు.
అయితే గతంలో చేసిన ప్రకటనలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉండటంతో పోలీసుల్లో అనుమానాలు పుట్టుకొచ్చాయి. శిశువులను వాణిజ్య ఉద్దేశాలతో ఇతరులకు ఇచ్చిన అనుమానంతో పాటు, శిశువుల విక్రయ ముఠాలతో సంబంధాలపై కూడా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసు చుట్టూ ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరోగసీ అనే పునీతమైన ప్రక్రియను కొందరు వ్యాపారంగా మలచడం పట్ల నెటిజన్లు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


