Case Filed on BRS, Congress Leaders Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ మేరకు పోలింగ్ సరళిని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని వీక్షిస్తున్నారు. దేశంలోనే తొలిసారి డ్రోన్ టెక్నాలజీ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ జరుగుతోందని సీపీ సజ్జనార్ అన్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో మధ్యాహ్నం 3 గం.ల వరకు 40.20 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గం.ల వరకు పోలింగ్ కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రాందాస్‌పై మధురా నగర్ పీఎస్‌లో మూడు కేసులు నమోదైనట్లు సీపీ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియామవళిని గౌరవించాలని వెల్లడించారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని ప్రజలను కోరారు.


