Kavitha at Chintamadaka: బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత హరీష్ రావును టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చింతమడక గ్రామంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కొందరు కేసీఆర్ కు మచ్చతెచ్చే పనులు చేస్తున్నారంటూ పరోక్షంగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఎంపీగా వెళ్లిన తర్వాతి నాటి నుంచి కొందరు సిద్ధిపేటను అలాగే చింతమడకను సొంతగా ఆస్తిగా ఫీలవుతున్నారని అన్నారు. సిద్ధిపేట్ వాళ్ల జాగీర్ కాదంటూ కవిత అన్నారు. తాను చింతమడకకు వస్తానని.. ప్రజలు దీవిస్తే అదే తన కర్మ భూమి అవుతుందంటూ ఎమోషనల్ అయ్యారు జాగృతి అధ్యక్షురాలు కవిత.
అయితే కవిత కామెంట్స్ చూస్తుంటే రాబోయే రాజకీయ సమరాల్లో ప్రభావం చూపే దిశగా ఇవి ఉన్నాయని రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. కేసీఆర్ కు తనను దూరం చేశారని.. కానీ చింతమడక తనకు అండగా నిలిచిందని కవిత చేసిన వ్యాఖ్యలు కవిత రాబోయే రాజకీయ అడుగులు, ప్రణాళికలకు శ్రీకారం చుడుతున్నట్లు పరిగణించొచ్చని విశ్లేషకులు అంటున్నారు. రోజురోజుకూ కవిత హరిష్ రావుపై చేస్తున్న కామెంట్స్ తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి.
అలాగే చింతమడకలో కవిత రాక సమయంలో సీఎం సీఎం అంటూ ఆమె అనుచరులు చేసిన నినాదాలు చూస్తుంటే అన్న చెల్లెళ్ల మధ్య రాజకీయ వారసత్వ పోరు తప్పదా అనే అనుమానాలు తెలంగాణ ప్రజల్లో రేకెత్తుతున్నాయి. స్వతంత్రంగా కొత్త రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేయాలని చూస్తున్న కవిత ఎలాంటి స్టెప్స్ భవిష్యత్తులో తీసుకుంటారనే క్యూరియాసిటీ ప్రజల్లో పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే ఏపీలో జగన్ షర్మిల మధ్య జరిగిన సీన్స్ రిపీట్ అవుతున్నాయని చాలా మంది అంటున్నారు. మెుత్తానికి తండ్రి స్వగ్రామం నుంచే ఆమె రెండో ఇన్నింగ్స్ పాలిటిక్స్ స్టార్ట్ చేస్తారనే ఊహాగానాలకు కవిత తాజా కామెంట్స్ బలాన్ని చేకూరుస్తున్నాయి.


