కోఠి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం బిల్లు పెట్టడం పట్ల యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం యూనివర్సిటీ ఆవరణంలోని దర్బార్ హల్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల విద్యను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమాన్ని కోరుతూ యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రానికి ఒక మహిళా యూనివర్సిటీ ఉంటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో విద్యావంతులైన మహిళల పాత్రను పెంచడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. యూనివర్సిటీ బిల్లు ఆమోదం పొందడం పట్ల తెలంగాణ విద్యార్థినులు, ఆడబిడ్డలు, తెలంగాణ సమాజం ముఖ్యమంత్రికి ఋణపడి ఉన్నారన్నారు. అలాగే యూనివర్సిటీ అభివృద్ధిలో, కోర్సుల నిర్వహణలో, విద్యార్థినుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.