LIC Vigilance Awareness Walkathon: విజిలెన్స్ అవేర్‌నెస్ వారోత్సవాల్లో భాగంగా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)- హైదరాబాద్ జోనల్ కార్యాలయం శనివారం వాకథాన్ నిర్వహించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజనల్ కార్యాలయాలు, అన్ని జోనల్ కార్యాలయాల ఉద్యోగులు, ఏజెంట్ల భాగస్వామ్యంతో వాకథాన్ విజయవంతంగా ముగిసింది. కాగా, ప్రతి ఏడాది ఉద్యోగుల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ (VAW) నిర్వహిస్తారు.
LIC హైదరాబాద్ జోనల్ ఆఫీస్ విజిలెన్స్ అవేర్‌నెస్ వారోత్సవాల్లో భాగంగా ఉద్యోగులకు పలు పోటీలు నిర్వహించారు. అక్టోబర్ 27న మొత్తం సౌత్ సెంట్రల్ జోన్‌లోని ఉద్యోగులతో సమగ్రత ప్రతిజ్ఞతో ఈ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ క్విజ్, ఆన్‌లైన్ వ్యాస రచన పోటీలతో పాటు సైబర్ భద్రతా అవగాహనపై ప్రసంగం నిర్వహించారు. ఇక, ఈరోజు జరిగిన వాకథాన్‌లో దాదాపు 300 మంది సిబ్బంది, ఏజెంట్లు పాల్గొన్నారు.
ఏపీ, తెలంగాణ ప్రాంతీయ మార్కెటింగ్ మేనేజర్ ఎం. రవి కుమార్ వాకథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఇది LIC జోనల్ ఆఫీసు వద్ద ప్రారంభమై తెలంగాణతల్లి ఫ్లైఓవర్, మింట్ కాంపౌండ్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్, ప్రసాద్స్ ఐమాక్స్, లుంబిని పార్క్ మీదుగా కొనసాగింది. విజిలెన్స్ అవగాహనపై సందేశాలను ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు.
అవినీతి దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ ఉద్దేశమని జోనల్ విజిలెన్స్ అధికారి ఇ. విద్యాధర్ అన్నారు. అవినీతి లేని సమాజాన్ని నిర్మించుకుందామని, కలిసికట్టుగా కృషి చేద్దామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం మన ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ పునీత్ కుమార్.. ఉద్యోగులు, ఏజెంట్లకు పలు సూచనలు చేశారు. అవినీతిని అరికట్టడంలో ప్రివెంటివ్ విజిలెన్స్ ప్రాముఖ్యతను ఆయన వివరించారు.


