హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన అందగత్తెల పోటీ మిరుమిట్లు గొలిపిస్తోంది. అయితే ఈ మహా పోటీలో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మిస్ ఇండియా నందిని గుప్తా ఆశాజనక ప్రదర్శనతో ముందుకెళ్లినా, ఫైనల్ శ్రేణిలోకి మాత్రం చేరలేకపోయారు. ఖండాల వారీగా టాప్-5 నుంచి ప్రతిభావంతులైన ఇద్దరిని షార్ట్‌లిస్ట్ చేస్తున్న వేళ, నందినిని ఫైనల్ రేస్ నుంచి తప్పించడంతో భారత అభిమానుల్లో నిరాశ నెలకొంది.
ఈ షాక్ తర్వాత టాప్-8 కంటెస్టెంట్స్ లిస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ గౌరవాన్ని దక్కించుకున్న వారు: మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాల ప్రతినిధులు. ఖండాలవారీగా పరిశీలిస్తే… కరేబియన్ నుంచి మార్టినిక్ అందాల భామ టాప్‌లో నిలవగా, ఆఫ్రికా నుంచి ఇథియోపియా అందగత్తె ముందంజ వేసింది. అదే విధంగా ఏషియా-ఓషియాన ఖండం నుంచి థాయిలాండ్ బ్యూటీ టాప్-1గా నిలిచారు.
ప్రతిసారి మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ ఖచ్చితంగా మెరిసేది. ఈసారి కూడా అదే ఆశతో దేశం మొత్తం కళ్లతో వేచి చూసిన వేళ, నందినికి చోటు దక్కకపోవడం నిరాశ కలిగించింది. అయితే పోటీలో పాల్గొన్న దేశాలు, అందులో ప్రతిభ చూపిన కంటెస్టెంట్లు చూసినవారంతా ఈసారి పోటీ స్థాయి గతకాలంతో పోల్చితే మరో మట్టు పైకి వెళ్లిందని చెబుతున్నారు. చివరికి మిస్ వరల్డ్ కిరీటం ఎవరి తలపై చేరుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.


