హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 10 నుంచి 31 వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ ఈవెంట్‌ను అత్యంత గొప్పగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. పోటీలు దగ్గరపడటంతో ఇప్పటికే దేశ విదేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ సారి మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున నందిని గుప్తా ప్రాతినిధ్యం వహించబోతుంది. ఆమె వయసు కేవలం 21 ఏళ్లే.
రాజస్థాన్‌కి చెందిన ఒక రైతు కుటుంబంలో నందిని జన్మించింది. కేవలం 10 ఏళ్ల వయస్సులోనే మిస్ ఇండియా అవ్వాలన్న కలలు తన పట్టుదలతో 19 ఏళ్లకే ఆ కలను నెరవేర్చుకుంది. 2023లో మణిపూర్‌లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచారు. అందం, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం కలగలిసిన ఆమె న్యాయనిర్ణేతల మనసులను గెలుచుకొని టాప్ పొజిషన్ దక్కించుకుంది.
ప్రస్తుతం నందిని ముంబైలోని లాలా లజ్‌పత్ రాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ చేస్తున్నారు. కోటాలోని సెయింట్ పాల్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో చదివారు. సామాజిక సేవలోనూ నందిని ఎంతో ఆసక్తి చూపుతోంది. ప్రాజెక్ట్ ఏక్తా అనే సంస్థతో కలిసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. స్థానిక హస్తకళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నందిని కోటా దోరియా వస్త్రాల ప్రాచుర్యానికి కృషి చేస్తున్నారు. ఆమె ఫ్యాషన్‌లోనూ, సంస్కృతిలోనూ తన రూట్‌ను చూపించేలా దుస్తుల ఎంపికలో ప్రత్యేక శైలిని పాటిస్తున్నారు. పుష్కర్, జైపూర్ వంటి ప్రాంతాల సాంస్కృతిక విలువలతో ఆమెకు ప్రగాఢ అనుబంధం ఉంది.

నందిని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. ఫ్యాషన్, మైండ్‌ఫుల్‌నెస్ కంటెంట్ షేర్ చేస్తూ యూత్‌లో బలమైన కనెక్షన్ ఏర్పరచుకుంటోంది. రోజూ యోగా, పిలాటెస్, డ్యాన్స్‌తో పాటు హెల్తీ డైట్‌ను పాటించడమే తన బ్యూటీ సీక్రెట్ అంటోంది. ఇక మిస్ వరల్డ్ 2025 కిరీటం దక్కే అర్హతలు అన్నీ నందినిలో ఉన్నాయంటూ నెటిజన్లు మద్దతు ఇస్తున్నారు. హైదరాబాద్‌కి వచ్చిన ఈ అందాల భామకు ఊహించని స్థాయిలో స్వాగతం లభించింది.

అసలు మిస్ వరల్డ్ పోటీలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి: మిస్ వరల్డ్ పోటీలు మొదట 1951లో బ్రిటన్‌లో ప్రారంభమయ్యాయి. ఎరిక్ మోర్లీ ఈ పోటీలకు స్థాపకులు. ఆయన మరణం తర్వాత, 2000 నుంచి ఆయన భార్య జూలియా మోర్లీ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ 71 ఎడిషన్లు జరగగా, 72వ ఎడిషన్ భారత్‌లో జరుగుతుండటం గర్వకారణం. ఈ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. పర్యాటక రంగానికి కూడా ఇది శుభపరిణామంగా నిలవనుంది.