తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం అధికార నివాసంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తమ కుమారుడు అఖిల్ అక్కినేని వివాహానికి ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు నాగార్జున దంపతులు పుష్పగుచ్ఛంతో కలిసి వెళ్లినట్టు తెలుస్తోంది.
ముంబైకి చెందిన కళాకారిణి జైనబ్ రవ్జీతో అఖిల్ వివాహం జరగబోతోంది. వీరిద్దరూ గతేడాది నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచే ఈ ప్రేమ జంట తరచూ కలసి కనిపిస్తూ మీడియాలో చర్చకు వస్తున్నారు. పలు విహారయాత్రలకూ వెళ్లిన ఈ జంట ఇప్పుడు పెళ్లి పందిరిలోకి అడుగుపెట్టబోతోంది. జూన్ 6న అఖిల్–జైనబ్‌ల వివాహం జరగబోతున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. అయితే అధికారికంగా మాత్రం ఈ తేదీపై ప్రకటించాల్సి ఉంది.
ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వివాహ ఏర్పాట్లు మొదలైనట్టు తెలుస్తోంది. ఇదే వేదికలో గతంలో నాగచైతన్య వివాహం కూడా జరిగింది. అదే తరహాలో అఖిల్ పెళ్లీ కూడా ఇంటి ఆవరణలోనే జరగనుందని సమాచారం. మరోవైపు ఇటీవల మిస్ వరల్డ్ 2025 పోటీల సందర్భంలో నాగార్జున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వేదిక పంచుకున్నారు. అల్లు అరవింద్, సురేష్ బాబు తదితరులు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నుంచే నాగార్జున సీఎం మధ్య సత్సంబంధాలు బలపడినట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే .. అఖిల్ ప్రస్తుతం “లెనిన్” అనే చిత్రం కోసం పని చేస్తున్నాడు. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సామాజిక స్పృహతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తంగా చూస్తే, అఖిల్ వివాహ వేడుక కోసం సినీ, రాజకీయ ప్రముఖులు ఒకే వేదికపై కనిపించనున్నారు.


