Ponnam Prabhakar: బీజేపీ నాయకులు కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సోమవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడంపై సమావేశంలో చర్చించామన్నారు. చర్చించాం అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఓటు చోరీకి సంబంధించిన అంశాలపై రాహుల్ గాంధీ గారికి మద్దతుగా కార్యక్రమాలు తీసుకోవడంపై టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించామన్నారు. రిజర్వేషన్ల కోసం బీజేపీపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఇప్పటికే ఢిల్లీ వేదికగా కేంద్రాన్ని నిలదీశామని, అయినా వారిలో చలనం రావడం లేదన్నారు. 22 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిపై ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం లూటీ చేస్తే.. తాము గాడిలో పెట్టామన్నారు. కులగణను తాము కట్టుబడి ఉంటే బీజేపీ అడ్డుకుంటున్నదని విమర్శించారు. బీసీ బిల్లులకు రాష్ర్టంలో బీజేపీ నేతలు మద్దతు ఇచ్చి.. కేంద్రంలో అడ్డుకుంటున్నదన్నారు. గతంలో కాంగ్రెస్ కుటుంబంలో ఉండి అనివార్య కారణాలతో పార్టీ మారిన వారిని తిరిగి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష
ఎరువుల విషయంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని, ఎరువుల తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రైతుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలని ఉద్దేశపూర్వకంగానే బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కై కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందననేది వాస్తవం అని, బాధ్యత వహించాల్సిన వాళ్లు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని దుయ్యబట్టారు. రైతులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్దేశపూర్వకంగానే నాలుగు నెలలుగా ఉత్పత్తి జరగడం లేదని, అక్కడ ఉత్పత్తి చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి 11 లక్షల టన్నులకుగానూ 5.2 లక్షల టన్నుల ఎరువులే వచ్చాయని.. ఎరువుల వైఫల్యం బాధ్యత బీజేపీ తీసుకావాల్సిందేనన్నారు. రాజకీయ కక్ష ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై తీర్చుకోవాలి కానీ రైతులపై కాదన్నారు. రైతుల సహకారంతో బీజేపీకి వ్యతిరేకంగా ఒత్తిడి తెస్తామన్నారు.


