Private Buses Inspection In SR Nagar: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో బైకర్‌తో సహా 19 మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ నేపథ్యంలో ట్రావెల్స్ బస్సుల భద్రత, అనుమతులపై అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలను సరిగ్గా పాటిస్తున్నారా..? బస్సులు నడిపేందుకు అనుమతులు ఉన్నాయా. లేదా.? భద్రతా చర్యలు పాటిస్తున్నారా లేదా.. అనే విషయాలను తనిఖీల్లో ముమ్మరంగా పరిశీలిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయం రాత్రి కావడంతో ప్రయాణికులు గాఢ నిద్రలోనే కన్ను మూశారు. బస్సు మంటల్లో కాలి బూడిదవడంతో.. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటం కలచివేసింది. ఈ ఘోర ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం(నలుగురు) మొత్తం చనిపోయింది. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం మృతి చెందారు. దుర్ఘటన పట్ల తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో పాటు రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/unidentified-dead-body-in-kurnool-bus-accident/
ఏపీ హోం మంత్రి అనిత, డిజీపీ హరీష్ గుప్తా, ఇంటిలిజెన్స్ ఛీప్ లడ్డా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మరణించిన కుటుంబాల పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాగా, బస్సుపై దాదాపు 24 వేలు జరిమానాలు ఉన్నాయని వెల్లడైంది. ఇక బస్ పొల్యూషన్ లైసెన్స్ కూడా 2024 లోనే ముగిసిందని సమాచారం.


