Restrictions in Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 14 ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉండే హోటల్స్, రెస్టారెంట్స్, మద్యం దుకాణాలు, క్లబ్స్ మూసివేయాలని ఆదేశించారు.
టపాసులు పేల్చడంపై నిషేధం: ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒక్కచోట గుంపుగా ఉండొద్దని హైదరాబాద్ సీపీ సజ్జనర్ జూబ్లీహిల్స్ ప్రజలకు సూచించారు. పోలింగ్ స్టేషన్ పరిధిలోని 200 మీటర్ల వరకు ఈ రూల్ వర్తిస్తుందని తెలిపారు. పోలింగ్ జరిగే తేదీ నవంబర్ 11న ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు నియోజకవర్గ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. మరోవైపు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చడంపై పోలీసులు నిషేధం విధించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో 4 రోజుల పాటు నియోజకవర్గ పరిధిలోని మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి నవంబర్ 12 ఉదయం వరకు వైన్ షాపులు మూసివేయాలని అధికారులు తెలిపారు.


