Ganja Seized in Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెండు రోజుల క్రిత్రం దాదాపు రూ. 3.50 కోట్ల విలువైన బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా అక్రమ రవాణాకు సంబంధించిన మరో ఘటన అదే విమానాశ్రయంలో చోటుచేసుకుంది. రూ. 12 కోట్ల విలువైన గంజాయిని దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు.
విదేశాల నుంచి అక్రమంగా కొందరు గంజాయి, గోల్డ్, డ్రగ్స్‌ను లగేజీలో కనపడకుండా ప్యాక్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు పట్టుకున్న ఘటనలు ఇప్పటివరకూ చాలానే వెలుగులోకి వచ్చాయి. వారిని కటకటాలకు పంపించినా ఇలాంటి సంఘటనలు ఇంకా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం దుబాయ్ నుంచి అక్రమంగా ఓ మహిళా ప్రయాణికురాలు 6 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుబడింది.
శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు రోజు వారీ తనిఖీల్లో భాగంగా ఓ మహిళ బ్యాగ్ చెక్ చేస్తుండగా దాంట్లో 6 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి లభ్యమైంది. పట్టుబడిన గంజాయి విలువ రూ. 12 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.


