హైదరాబాద్ మొత్తం ఖాళీగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లోని రోడ్లు ప్రజలు లేక నిర్మానుష్యంగా మారాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులంతా సొంతూళ్లకు తరలి వెళ్లారు. దీంతో నగరంలోని రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. ఎటు చూసినా రోడ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. నిన్న మొన్నటివరకు వాహనాలతో కిక్కిరిసిన రోడ్లు నేడు ఎవరూ లేక బోసిపోయాయి. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డులపో పాటు రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, వరంగల్ హైవేలలోని టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. సోమవారం భోగీ కావడంతో.. ఒక రోజు ముందే సొంత గ్రామాలకు చాలా మంది వెళ్లిపోతున్నారు.
ఉపాధి, ఉద్యోగం, ఇతర అవసరాల కోసం.. భాగ్యనగరంలో స్థిరపడిన ఎంతో మంది సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్తుంటారు. దీంతో బస్సులు, ట్రైన్లు, విమానాలు, సొంత వాహనాలు.. ఇలా రకరకాల మార్గాల్లో ఇళ్లకు వెళ్తుంటారు. అయితే రోడ్డు మార్గంలో వెళ్లేవారు అధికంగా ఉండగా.. వారికి ఇప్పుడు ట్రాఫిక్ అనేది అతి పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ శివార్లు దాటాలంటే గంటల తరబడి రోడ్లపై నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్-విజయవాడ మార్గంలో అయితే వాహనాల కదలికలు చాలా ఆలస్యంగా ఉన్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ఈ రద్దీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక పండగకు రోడ్డు మార్గంలో ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే వాహనదారుల కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. వీటి ద్వారా తొందరగా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుందని పోలీసులు అంటున్నారు. నిజానికి శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్-విజయవాడ మార్గంలో హైవేపై వాహనాల రద్దీ మొదలైంది. ఇక పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇరువైపులా కలిపి 16 టోల్ బూత్‌లు ఉండగా.. రద్దీ నేపథ్యంలో విజయవాడ మార్గానికి 10 కేటాయించారు. ఇక ఆదివారం చౌటుప్పల్‌లో మార్కెట్ జరగనుంది. అప్పుడు హైదరాబాద్-విజయవాడ హైవేపై వెళ్లే వాహనాలకు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తనున్నాయి. దీంతో సంక్రాంతికి వెళ్లే వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నా పోలీసులు.