Hyderabad Traffic Man: నగర జీవితం అంటేనే.. ఉరుకులు పరుగులతో కూడిది. ఉద్యోగ జీవితంలో బిజీబిజీగా గడుపుతూ వారాంతం వచ్చిందంటే.. విశ్రాంతి తీసుకోవడమో, కుటుంబంతో సరదాగా ట్రిప్‌లు వేయడమో చేస్తుంటాం. కానీ ఓ వ్యక్తి అలా కాదు. వృత్తి సాఫ్ట్‌వేర్ అయినా .. సమయం చిక్కినప్పుడల్లా ట్రాఫిక్ వాలంటీర్‌గా సేవలందిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ మ్యాన్‌గా గుర్తింపు గుర్తింపు పొందాడు. అయితే అతడెవరో తెలుసుకుందాం.
హైదరాబాద్ ట్రాఫిక్ మ్యాన్‌గా రాజస్థాన్ వాసి: వృత్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయినా.. ప్రవృత్తి రీత్యా నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై అవగాహన కల్పిస్తూ ఓ వ్యక్తి ‘హైదరాబాద్ ట్రాఫిక్ మ్యాన్’గా పేరుగాంచాడు. హైదరాబాద్‌లో నివాసముండే లోకేంద్రసింగ్ తన సేవలతో ఈ గుర్తింపు పొందాడు. తన స్వస్థలం హైదరాబాద్ కానప్పటికీ.. సమయం చిక్కినప్పుడల్లా తాను ట్రాఫిక్ మ్యాన్‌గా అవతారం ఎత్తుతున్నాడు. లోకేంద్రసింగ్ స్వస్థలం రాజస్థాన్. తన తండ్రి వ్యాపారం నిమిత్తం కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. దీంతో వారి కుటుంబం మొత్తం హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అనంతరం తాను నగరంలోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ వీలున్నప్పుడల్లా.. ట్రాఫిక్ వాలంటీర్‌గా అవతారం ఎత్తుతున్నాడు. నీతి ఆయోగ్ సర్వే ప్రకారం దేశంలో 80శాతం వరకు అక్షరాస్యులున్నప్పటికీ.. 1.5 శాతం మందికి మాత్రమే ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసని లోకేంద్రసింగ్ అన్నారు. అందుకే తాను ట్రాఫిక్ పైన అవగాహన కల్పిస్తున్నట్టుగా తెలిపారు. 15 మందితో ఓ బృందంగా ఏర్పడి నగర వ్యాప్తంగా ట్రాఫిక్ వాలంటీర్స్‌గా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. మా సేవలను గుర్తించిన హైదరాబాద్ పోలీసులు.. ట్రాఫిక్ వాలంటీర్‌గా పలు అవార్డులు అందుకున్నట్టుగా లోకేంద్రసింగ్ తెలిపారు.
“18వ ఏట డ్రైవింగ్ స్కూల్‌లో చేరినప్పుడు.. కేవలం డ్రైవింగ్ అంశాలపైన మాత్రమే శిక్షణ ఇచ్చారు. ఇతర ట్రాఫిక్ నిబంధనల జోలికి అస్సలు వెళ్లలేదు. దీంతో రహదారి నియమాలు, మోటార్ వెహికిల్ యాక్ట్ గురించి తెలుసుకోవాలనే ఆత్రుత నాకు పెరిగింది. అందుకే రోడ్డు భద్రత, బేసిక్ లైఫ్ సపోర్ట్‌పై శిక్షణ తీసుకున్నా. అనంతరం 2021లో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో ట్రాఫిక్ వాలంటీర్‌గా చేరాను. నాలాంటి ఆలోచన కలిగిన సుమారు 15 మందితో ఓ సమూహంగా ఏర్పడ్డాం. వారి సాయంతో హైదరాబాద్ వ్యాప్తంగా శిబిరాలు నిర్వహిస్తున్నాం. సీటు బెల్టు పెట్టుకోవడం దగ్గర నుంచి.. స్టాప్ లైన్, లైన్ క్రమశిక్షణ, హారన్ ప్రాధాన్యం గురించి ప్రయాణికులకు వివరిస్తాం.”_ హైదరాబాద్ ట్రాఫిక్ మ్యాన్


