Sri Aurobindo Society Telugu States Conference: నేటి ఆధునిక ప్రపంచంలో మెరుగైన జీవితానికి ఆధ్యాత్మికతను పునాదిగా చేసుకోవాలని శ్రీ అరబిందో సొసైటీ ఎండీ, సైకియాట్రిక్ డా. అలోక్ పాండే సూచించారు. టెక్నాలజీ ప్రపంచంలో ఆధ్యాత్మికత ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో హైదరాబాద్‌లోని బేగంపేట ‘ది ప్లాజాలో’ శ్రీ అరబిందో సొసైటీ ఆధ్వర్యంలో ఒక రోజు వార్షిక తెలుగు రాష్ట్రాల సదస్సును నిర్వహించారు.
‘శ్రీ అరబిందో అండ్ మదర్’ ఆధ్యాత్మికతను ఒక విశ్వాస వ్యవస్థగా కాకుండా, జీవన వాస్తవికతగా భావించింది. ఈ క్రమంలో ఈ సొసైటీ అందించే బోధనలు.. వ్యక్తులు తమ వ్యక్తిగత, భావోద్వేగ, మానసిక, సామాజిక జీవిత పరిస్థితుల ద్వారా ఆధ్యాత్మికంగా జీవించడానికి ప్రోత్సహిస్తాయని వక్తలు పేర్కొన్నారు. సదస్సులో భాగంగా శ్రీ అరబిందో సొసైటీ ఎండీ, సైకియాట్రిస్ట్ డా. అలోక్ పాండే పలు సూచనలు చేశారు.
‘ఆధ్యాత్మికత మన జీవనానికి పునాదిగా ఉండాలి. జీవితాన్ని నడిపించడానికి ఇది తిరుగులేని మార్గదర్శకత్వం. బాహ్య ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల మధ్య కూడా సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ఈ సానుకూల ఆధ్యాత్మికత మనిషికి శక్తినిస్తుంది.’ అని అలోక్ సూచించారు. ఈ సదస్సు యువతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. నేటి యువత కెరీర్, రిలేషన్స్, మానసిక ఆరోగ్యం, ఏడీహెచ్‌డీ, ప్రపంచ సంస్కృతుల ప్రభావానికి సంబంధించిన లోతైన అస్తిత్వ ప్రశ్నలను ఎదుర్కొంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికత స్థిరత్వం, స్పష్టత.. మనిషిలో శాంతిని పెంపొందించి, జీవితంలోని సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి దోహదపడుతుందని అలోక్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ‘శ్రీ అరబిందో అండ్ మదర్’ సొసైటీతో పాటు పాండిచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమం, ఆరోవిల్లే వంటి సంస్థలు.. ఆధ్యాత్మిక అంశాలను విద్య, ఆరోగ్య సంరక్షణ, సామూహిక జీవనం, సామాజిక కార్యాచరణలో ఏ విధంగా అమలు చేస్తున్నాయో అలోక్ తన ప్రసంగంలో వివరించారు. ముషీరాబాద్‌లోనూ ఈ కేంద్రాల ద్వారా చిన్నారులు, యువతకు.. ఆధ్యాత్మిక ధ్యానాలు, కార్యక్రమాలతో మార్గనిర్దేశం చేస్తున్నాయని చెప్పారు. అధ్యయన బృందాలతో పాటు ఈ కేంద్రంలో ఒక గ్రంథాలయం, పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ కేంద్రాలకు కొత్తగా వచ్చే వారితో పాటు పాత సాధకులకు కూడా మార్గనిర్దేశం చేయడానికి శిక్షణ పొందిన స్వచ్ఛంద సేవకులు ఉన్నారని వివరించారు.
చివరిగా ఈ సదస్సులో చైతన్యవంతమైన జీవనం, చదువులో ఆధ్యాత్మికత ప్రాముఖ్యత, యువత సాధికారత, ఆధునిక యుగంలో శ్రీ అరబిందో ఆలోచనల ఔచిత్యం వంటి అంశాలపై ప్రముఖ వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమం యువతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించినప్పటికీ ఇది అన్ని వయసుల వారికి ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రజలకు శ్రీ అరబిందో సొసైటీ కార్యకలాపాలతో అనుసంధానం కావడానికి దోహదపడుతుందని వివరించారు.

