Srishti Fertility Scam Dr. Namrata Buys Properties: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో నిర్వాహకులు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవల సికింద్రాబాద్‌లోని సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్‌పై ఒక బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సరోగసీ ముసుగులో సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు, ప్రధాన నిందితురాలు డా.నమ్రత చేసిన బాగోతాలను పోలీసులు బయటపెడుతున్నారు. తాజాగా నమ్రత.. శిశువులను విక్రయించగా వచ్చిన డబ్బుతో ఏం చేశారనేది తెలిసింది.
భారీగా ఆస్తులు…
ఆ డబ్బుతో నమ్రత భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలిసింది. ఒకటి, రెండు చోట్ల కాదు ఏకంగా అనేక చోట్ల ఫామ్ హౌసులు, భవనాలను కొనుగోలు చేసిందని తెలిసింది. కూకట్ పల్లి, మియాపూర్, సికింద్రాబాద్, యూసుఫ్ గూడ, వైజాగ్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఆమె ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్లు సమాచారం అందింది.
మరో వ్యక్తి అరెస్ట్…
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో తాజాగా మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కృష్ణ అనే వ్యక్తిని గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌తో ఇప్పటి వరకు అరెస్టైన నిందితుల సంఖ్య 12కు చేరింది. ఆగస్ట్ 2న ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్, రిసెప్షనిస్ట్ నందినిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా, శిశువుల క్రయ విక్రయాల్లో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతకు ఏజెంట్లుగా హర్షరాయ్, సంజయ్, కృష్ణ లాంటి వారు వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పిల్లలను విక్రయించే ఏజెంట్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్ట్ అయిన వారి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టే పనిలో ఉన్నట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మరో నాలుగు రాష్ట్రాల్లోనూ డాక్టర్ నమ్రతకు భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.


