Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలనే పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. నిర్వహణ సంస్థ ఎల్‌అండ్‌టీతో గత కొన్ని రోజులుగా చర్చిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ చర్చలు కొలిక్కి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఎల్‌అండ్‌టీ మధ్య అంగీకారం కుదరడంతో సర్కారు చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.
మెట్రో రైలు మొదటి దశలో నష్టాలను చవిచూస్తున్న ఎల్‌అండ్‌టీ సంస్థకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. సంస్థకు ఉన్న రూ. 13 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయనుంది. ప్రస్తుతం సంస్థకు రూ. 2100 కోట్లు ప్రభుత్వం చెల్లించనుంది. కాగా, హైదరాబాద్ మెట్రో మొదటి దశను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ. 22 వేల కోట్ల వ్యయంతో నిర్మించారు. ప్రస్తుత ఒప్పందంతో హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి L&T సంస్థ వైదొలగనుంది.
దేశంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో.. తాజా గణాంకాల ప్రకారం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. గత కొన్నేళ్లుగా మెట్రో విస్తరణలో మందకొడిగా ఉండటంతో, దేశంలోని మెట్రో వ్యవస్థల్లో హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి పడిపోయింది. ఢిల్లీ, బెంగళూరు వంటి మిగిలిన నగరాలు తమ రెండో, మూడో దశల నిర్మాణాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో విస్తరణ పనుల్లో మాత్రం జాప్యం ఏర్పడుతోంది.
2014లో మెట్రో రైలు నెట్‌వర్క్ పొడవు పరంగా దేశంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో.. 2025లో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. గత ఏడేళ్లుగా మెట్రో విస్తరణ సరిగ్గా జరగలేదని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాలు తమ మెట్రో విస్తరణ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటుండగా.. హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం నుంచి అనుమతి లభించకపోవడం వల్ల కూడా పనులు ఆలస్యం అవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
కాగా, హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌లు సమీక్షలో ఉన్నాయి. ఈ విస్తరణతో శంషాబాద్ విమానాశ్రయంతో సహా నగరం మొత్తం మెట్రో నెట్‌వర్క్ 163 కి.మీ వరకు పెరగనుంది. అయితే భవిష్యత్తులో ఈ విస్తరణలకు మార్గం సుగమం అయితే నగరం తిరిగి మెరుగైన స్థానాన్ని చేరుకునే అవకాశం ఉంది.


