తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి నాంపల్లి మనోరంజన్ కోర్టు మెట్లెక్కారు. గతంలో ఎన్నికల నియమాలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో విచారణలో భాగంగా ఆయన ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. ఆయన సీఎం పదవి చేపట్టిన తర్వాత కోర్టుకు హాజరైన రెండోసారి. ఈ కేసులు ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నమోదయ్యాయి. బేగంబజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ మూడు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ కేసులకు కేంద్ర బిందువయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణకు రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రావడంతో కోర్టు పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టంగా చేశారు. మీడియా సహా ఇతరులకు కోర్టు హాల్‌లో ప్రవేశాన్ని అడ్డుకున్నారు. విచారణ సందర్భంగా రేవంత్ తనపై వచ్చిన కేసులను పూర్తిగా తప్పుడువని, తాను ఎక్కడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. కోర్టు ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసింది.
విచారణ అనంతరం రేవంత్ కోర్టు నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ కేసుపై తీర్పును వచ్చే నెల 12న నాంపల్లి కోర్టు వెలువరించనుంది. ఈ కేసు ఫలితంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.


