హెచ్ఐసీసీ వేదికగా జరిగిన భారత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.. రాష్ట్రం తలపెట్టుకున్న మార్పుకు కొత్త దారులు తొక్కుతున్నామని అన్నారు. సమ్మిట్‌లో పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. తెలంగాణకు గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ, గత పదేళ్ల పాలన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద మళ్లీ విశ్వాసం పెట్టారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతులకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రూ. 20,617 కోట్లతో రైతు రుణమాఫీ పూర్తి చేశామని, దేశంలో ఇదే అతిపెద్ద రుణమాఫీ కార్యక్రమమని వివరించారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.12,000 మద్దతు ఇస్తున్నామని, రైతుల కోసం 24 గంటలు ఉచిత విద్యుత్ సౌకర్యం అందిస్తున్నామని వెల్లడించారు. గతంలో రైతులు మద్దతు ధర కోసం పోరాడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు, మద్దతు ధరతో పాటు ధాన్యానికి క్వింటాల్‌కు అదనంగా రూ. 500 బోనస్ ఇస్తున్నామని స్పష్టం చేశారు.
విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, అయితే గతంలో వారిని గౌరవించలేదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో మాత్రం తొలి ఏడాదిలోనే 60 వేలపైగా ఉద్యోగాల భర్తీ చేసినట్లు వెల్లడించారు. అలాగే, 5 లక్షల యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తున్నామని వివరించారు. సామాజిక వర్గాల కలిసికట్టును దృష్టిలో పెట్టుకొని పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారతపై దృష్టిసారిస్తూ, మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. “మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం” అని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్నట్లు చెప్పారు.
ఆరోగ్య రంగంలో కూడా విస్తృతమైన మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిధిని రూ. 10 లక్షల వరకు పెంచినట్లు తెలిపారు. ఏడాదిలో దాదాపు రూ. 1000 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. మూసి నదిని పునరుజ్జీవనం చేయాలని సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నామని, భవిష్యత్తులో మూసి ఒక పెద్ద ఆకర్షణగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.