ఫార్ములాఈ కార్ రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలన్న పిటిషన్ పై ఇప్పటికే ఇటీవల వాదనలు ముగిశాయి. ఇక తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే క్వాష్ పిటిషన్ పై ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని. తనకు వ్యక్తిగతంగా కూడా ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం జరగలేదని కేటీఆర్ అంటున్నారు. అందుకే తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ను కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.
ఈ కేసులో కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఏసీబీ కార్యాలయానికి తన లాయర్లతో కలిసి వెళ్లిన కేటీఆర్ ను పోలీసులు అడ్డుకున్నారు. లాయర్లతో కాకుండా ఒంటరిగానే లోపలికి వెళ్లాలంటూ పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ఆ క్రమంలో ఏసీబీకి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం కేటీఆర్ కు మరోమారు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 2025 జనవరి 09వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో వెల్లడించారు. గచ్చిబౌలి ఓరియన్ విల్లాకు వెళ్లిన ఏసీబీ అధికారులు.. ఈ మేరకు కేటీఆర్‌కు నోటీసులు అందించారు.
ఇక ఇవ్వాళ ఇదే కేసులో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా… తాను మంగళవారం రోజున విచారణకు హాజరు కాలేనని.. తనకు మరింత సమయం ఇవ్వాలని కోరారు కేటీఆర్. మంగళవారం కోర్టు తీర్పు ఉన్నందున విచారణకు రాలేనన్నారు. దీనిపై స్పందించిన ఈడీ.. తదుపరి విచారణ తేదీని త్వరలో తెలియజేస్తామంది.