Osman Sagar, Himayat Sagar Hyderabad: హైదరాబాద్ వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి కుండపోత వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భారీ వర్షానికి జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తింది. దీంతో ఈ రెండు జలాశయాలు నిండుకుండలా మారి జలకళను సంతరించుకున్నాయి.
ఈ క్రమంలో హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 3 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 4,100 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ఉస్మాన్ సాగర్ 10 గేట్లు ఎత్తివేయగా.. ఇన్‌ఫ్లో 4,500 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 7,096 క్యూసెక్కులుగా నమోదైంది.
జంట జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో మూసీ నదికి వరద ఉధృతి ఎక్కువైంది. వరద నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో నార్సింగి, హిమాయత్‌సాగర్ వద్ద సర్వీస్ రోడ్డును మూసివేశారు. మంచిరేవుల – నార్సింగ్ మధ్య రాకపోకలు నిలిపివేశారు.


