ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం చేసిన సాహసోపేత దాడులు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న సమయంలో.. ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదాలపై కేంద్రం నుంచి స్పష్టత లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత వైమానిక దళం విజయవంతంగా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడాన్ని అభినందించాలన్నారు. కానీ ఆపరేషన్ సమయంలో ఎంతమంది సైనికులు చనిపోయారు.. ఎన్ని విమానాలు కూలిపోయాయి.. అనే ప్రశ్నలకు విదేశాంగ శాఖ ఇప్పటికీ సరైన సమాధానం ఇవ్వడం లేదని అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా, ఒక రాఫెల్ ఫైటర్ జెట్ కూలిపోయిన విషయమై కాంగ్రెస్ నేతలు ప్రశ్నించగానే వారిని దేశద్రోహులు అంటూ బీజేపీ నేతలు విమర్శించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తాజాగా సీడీఎస్ అనిల్ చౌహాన్ స్వయంగా రాఫెల్ కూలిపోయిన విషయాన్ని ధ్రువీకరించారని గుర్తుచేస్తూ.. “ఇప్పుడు ఆయనను కూడా దేశద్రోహి అంటారా..? అంటూ విమర్శించారు.
మరోవైపు దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన ఫైటర్ జెట్ ఉత్పత్తిలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని కూడా ఉత్తమ్ వ్యాఖ్యానించారు. HAL (Hindustan Aeronautics Limited) ఏడాదికి 24 విమానాలు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అది సాధ్యపడటం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ రక్షణ అవసరాల్ని పరిగణనలోకి తీసుకుని.. ప్రొడక్షన్ వేగం పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. “రక్షణ రంగం ఆధునీకరణలో ఎదురయ్యే సమస్యలను తేల్చేందుకు నిపుణులంతా ముందుకు రావాలన్నారు.. యువ మేధావులు రక్షణ రంగంలో అవకాశాలను అన్వేషించాలని ఆయన పిలుపునిచ్చారు.


