Interesting facts about Bonalu Jathara: తెలంగాణ రాష్ట్రంలో హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బోనాల జాతర ఒకటి. జూలై-ఆగస్టు నెలలో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్రపండుగగా నిర్వహిస్తున్నారు. జూన్ 26న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆలయ అర్చకులు తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర షురూ అయింది. ఈ వేడుకలు వచ్చే నెల 24న ముగుస్తాయి.
బోనం ఎలా వండుతారు?
బోనం అంటే భోజనం అని అర్థం. దీనిని అమ్మవారికి సమర్పిస్తారు. అన్నం, పాలు, బెల్లంతో కలిపి వండిన బోనాన్ని మట్టి కుండల్లో పెడతారు. ఆ కుండలను వేప ఆకులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. ఈ కుండలపైన దీపాన్ని వెలిగిస్తారు. మహిళలు ఈ బోనాన్ని తలపై పెట్టుకుని డప్పులు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల ఆటపాటలు, మేళతాళాలతో అమ్మవారి ఆలయాలకు వచ్చి బోనం సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో దేవీ ఆలయాలన్నీ దేదీప్యమానంగా అలంకరిస్తారు.
ఆషాఢ మాసమే ఎందుకు?
ఆషాఢ మాసంలో మహిళలు అత్తింటి నుంచి పుట్టింటికి ఎలా వెళతారో.. అమ్మవారు కూడా తన కన్న ఇంటికి వెళ్తుందని నమ్ముతారు. అందుకే భక్తులు దేవిని తమ సొంత కూతురుగా భావించి, తమ ఇంటికి వచ్చిందనే భావనతో ఎంతో సంతోషంగా బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. బోనాల పండుగను ‘ఊరడి’ అని కూడా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ అని కూడా అంటారు.
దున్నపోతులను ఎందుకు బలిస్తారు?
గతంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులు పారద్రోలటానికి దున్నపోతులను బలి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో కోడిపంజులను బలి ఇస్తున్నారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను అప్పుడప్పుడు అమ్మవారు ఆవహిస్తారని నమ్ముతారు. ఆ సమయంలో దేవిని శాంతపరచడానికి ఆమె పాదాలపై నీళ్లు చల్లుతారు. బోనాల పండుగ గోల్కోండ జగదాంబిక ఆలయం వద్ద మెుదలై..లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీకి చేరుకుంటుంది.
రంగం అంటే ఏమిటి?
బోనాల జాతర రెండో రోజు రంగం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పోతురాజు వేషం వేసుకున్న వ్యక్తం పూనకం వస్తుంది. అతడి కోపాన్ని తగ్గించేందుకు భక్తులు మేకపోతును అతనికి అందిస్తారు. పోతురాజు తన నోటితో ఆ మేకపోతును కొరికి తల, మెండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు. దీన్నే రంగంగా పిలుస్తారు.
ఘటం అంటే ఏమిటి?
అమ్మవారి ఆకారంలో అలంకరించిన రాగి కలశాన్ని ఘటం అని పిలుస్తారు. ఈ ఘటాన్ని పూజారి మోస్తాడు. జాతర తొలి రోజు నుండి చివరి రోజు వరకు ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు. సాధారణంగా ఘట ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది.