Woman came to vote with infant: మన భవిష్యత్తును నిర్ణయించేది మన వేసే ఓటు. సరైన పాలకుడిని ఎన్నుకుని వారు తప్పులు చేస్తే ప్రశ్నించే అధికారం ఓటర్లకు ఉంది. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పోలింగ్ రోజును సెలవు రోజుగా భావించకుండా సామాజిక బాధ్యతగా భావించి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తప్పనిసరి ఓటు వేసి తీరాలి. అందుకే ఈ తల్లి.. మండే ఎండలో సైతం కష్టం అనుకోకుండా పసికందుతో వచ్చి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకుంది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/chandrababu-naidu-kanigiri-msme-parks-inauguration/
నా ఒక్కడి ఓటు వేయకపోతే ఈ సమాజానికి వచ్చిన నష్టం ఏముంది లే.. మనం ఓటు వేసినా.. వేయకపోయినా.. ఈ రాజకీయ నాయకులు ఏమైనా మారతారా.. అవినీతి అంతమైపోతుందా.. అని తమను తాము సమర్థించుకుంటూ ఇంట్లో టీవీ చూస్తూ కూర్చోవడమో లేదా పోలింగ్ రోజు హాయిగా సెలవు దొరికిందని విశ్రాంతి తీసుకోవడమో చేస్తుంటారు కొందరు. కానీ, అలాంటి వారే కొన్ని సందర్భాల్లో గొంతెత్తి ప్రభుత్వంపై విమర్శలు చేయడం చూస్తుంటాం. రోడ్లు బాగాలేకపోయినా.. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోయినా.. ధరలు పెరిగినా.. ప్రతి కారణానికి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతారు. కానీ వాళ్లే కనుక ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుడికి ఓటు వేస్తే ఈ పరిస్థితులు తలెత్తవు కదా అని ఆలోచించరు. ఇలా ఎవరికి వారు తమను తాము సమర్థించుకొని ఓటు వేయకపోవడం వల్లే నియోజకవర్గంలో 100 శాతం పోలింగ్ జరగడం లేదు. ఫలితంగా సమాజంలో ఆశించిన మార్పు జరగడం లేదు. కానీ ఇలాంటి వారికి చెంపపెట్టు సమాధానం ఈ పసిపాప తల్లి.
జూబ్లీహిల్స్‌లో పోలింగ్ సందర్భంగా ఓటు వేయడానికి ఓ తల్లి బిడ్డతో సహా పోలింగ్ స్టేషన్‌కు వచ్చింది. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్.. బిడ్డతో తల్లి పడుతున్న అవస్థలు చూసి తాను బిడ్డను చూసుకుంటానని చెప్పి ఆమెను ఓటు వేసి రావాల్సిందిగా సూచించింది. దీంతో సంతోషంగా ఆ బిడ్డను కానిస్టేబుల్‌కి ఇచ్చి.. ఆ మహిళ ఓటు వేయడానికి బూత్‌లోనికి వెళ్లింది. ఓటు వేయడానికి బద్దకించే అజ్ఞానులు ఇలాంటి మహిళలను చూసి జ్ఞానోదయం పొందాలి.
ఓటు వేయడం బాధ్యతగా భావించిన ఆమె.. చంటి బిడ్డను ఎత్తుకుని పోలింగ్ స్టేషన్‌కు రావడం అభినందనీయం. ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది.. బిడ్డను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆ తల్లి భావించి ఉంటే పాలకులు తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు కోల్పేయేది. చిన్న చిన్న కారణాలు సాకుగా చూపి పోలింగ్ స్టేషన్ వెళ్లి ఓటు వేయడానికి బద్దకించే వాళ్ళు.. ఒక్క క్షణం ఈ తల్లి లాగే బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫలితంగా నూటికి నూరుశాతం పోలింగ్ నమోదు కావడంలో ఎలాంటి అవాంతరాలు ఉండవు.


