Bear Hulchul in karimnagar: కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేపింది. కొత్తపల్లి మండలం రేకుర్తిలో ఎలుగుబంటి సంచారం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. రెండు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఎలుగుబంటి ఇళ్ల మధ్య రోడ్లపై నడుచుకుంటూ వెళ్లడం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఆ ఎలుగు బంటి గుట్టల సమీపంలోని మామిడి తోటలో తిరుగుతోందని, అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ తాజా ఘటన జూలై 09వ తేదీ రాత్రి 9 గంటల 43 నిమిషాల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఎవరూ రోడ్డుపై లేకపోవడం, అందరూ ఇళ్లలోనే ఉండటంతో ఎవరికీ ఎటువంటి ఆపద కలుగలేదు.
కరీంనగర్ రేకుర్తిలో ఎలుగుబంటి సంచారం.. జులై 9వ తేదీన సీసీ కెమెరాలో రికార్డు pic.twitter.com/RBwMZDhiap
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) July 11, 2025
రేకుర్తిలో ఎలుగుబంట్లు తిరగడం ఇదే తొలిసారి కాదు.. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. 2022 జూలైలో గ్రామంలోని ఓ మార్బుల్ స్టోర్ లో ఎలుగుబంటి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డుయ్యాయి. అంతేకాదు కొన్నాళ్ల క్రితం శాతవాహన యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోనూ ఎలుగుబంటి కనిపించింది. అప్పట్లో అటవీశాఖ అధికారులు దాని గురించి తీవ్రంగా గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ ఎలుగే ఇది అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ బల్లూకాన్ని ఎలాగైనా పట్టుకుని తమను ఈ భయం నుంచి విముక్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మానవుడి విధ్వంసక చర్యల కారణంగానే జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. మనం అభివృద్ధి కోసమో లేదా విలాసాల కోసమో విచ్చలవిడిగా అడవులను నరికివేయడం వల్ల యానిమల్స్ ఎటు పోవాలో తెలియక ఇలా ఇళ్ల మధ్యకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


