బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి కొండ కింద భూముల్లో అనధికార నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం కొండ కింద ఉన్న అటవీశాఖ భూమిలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి, వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

రోజురోజుకూ నిర్మాణాలు పెరిగిపోతుండడంతో అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, వెంటనే తొలగించాలని ఆదేశించారు. కానీ వారి నుంచి స్పందన లేకపోవడంతో బీర్పూర్ గ్రామానికి చెందిన యువ చైతన్య యూత్ సభ్యులు 20 గుంటల స్థలంలో యూత్ కార్యాలయ భవనం నిర్మించుకుంటామని సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ, రెవెన్యూశాఖ, పోలీస్ శాఖ అక్కడికి చేరుకుని నిర్మాణాలను ఆపాలని యూత్ సభ్యులకు సూచించారు. యువకులు అక్రమ నిర్మాణాలపై అధికారులను నిలదీశారు. దీనిపై స్పందించిన అటవీశాఖ సెక్షన్ అధికారి గంగారాం నోటీసులు ఇచ్చామని, నిర్మాణాలు మార్చి 10 లోపు తొలగించకపోతే మేమే తొలగిస్తామని పేర్కొన్నారు.
