సారంగాపూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్ట్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం చిల్వకొడూరు, జైన లిఫ్ట్ లను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకొని మాట్లాడుతూ గోదావరి లిఫ్ట్ పై ఆధారపడి సుమారు 15 వేల ఎకరాలకుపైగా ఆయకట్టు సాగుచేస్తారని, కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా గోదావరిలో నీరు లేకపోవడంతో సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఒక టిఎంసి నీటినీ విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రోళ్ళ వాగు విషయంలో కూడా ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారులు, కాంట్రాక్టర్ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొంత సమస్య ఏర్పడుతోందని, గత ప్రభుత్వం వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని 60 కోట్లతో ప్రాజెక్ట్ ను ప్రారంభించి, దాన్ని 140 కోట్లకు తీసుకెళ్లి, రోళ్ల వాగును మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ గా మార్చారని ఆరోపించారు. కమీషన్లకు ఆశపడి రిడిజైనింగ్ పేరుతో డబ్బులు దోచుకోవడానికి తప్ప ఇట్టి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలన్న ఉద్దేశం గత ప్రభుత్వ పాలకులకు లేదంటూ ఆవేదన వెళ్లగక్కారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా రోళ్ల వాగు ప్రాజెక్ట్ నుండి తాత్కాలిక ప్రాతిపదికన నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.