Sunday, January 5, 2025
HomeTS జిల్లా వార్తలుకరీంనగర్Beerpur: వీధికుక్కలకు వింత రోగాలు

Beerpur: వీధికుక్కలకు వింత రోగాలు

కుక్కల దాడి

గ్రామాల్లో వీధి కుక్కలకు సోకుతున్న చర్మ వ్యాధులతో ప్రమాదం పొంచి ఉంది. గత నెల రోజులుగా వీధి కుక్కలకు కొత్త రోగం అంటుకుంది. కుక్కల ఒంటిపై బొచ్చు ఊడి పోవడం, దద్దుర్లు రావడం, చిన్న చిన్న పుండ్లు ఏర్పడుతున్నాయి. పశువులకు లంపీ స్కిన్ వైరస్ సోకినట్టే కుక్కలకు కూడా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి ఒకదాని నుంచి మరొక దానికి వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. పశువైద్య సిబ్బంది లెక్కల ప్రకారం మండలంలో సుమారు 800 కుక్కలు ఉన్నాయి. వీటిలో చాలా కుక్కలకు ప్యారాసైట్ ఇన్ఫిస్టేషన్ వ్యాధి బారిన పడ్డాయి. ఇది రెండు రకాలుగా ప్రభావం చూపుతోంది. వాటి శరీరంపై బొచ్చు ఊడిపోయి గజ్జి లాంటి దద్దుర్లు వస్తున్నాయి. రెండో రకం కొన్ని కుక్కల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. వాటి కడుపులో లివర్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయని పశు వైద్యాధికారులు చెబుతున్నారు.

- Advertisement -

రోగ నివారణకు చర్యలు శూన్యం
వ్యాధి బారిన పడిన కుక్కలకు ట్రీట్మెంట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ప్రస్తుతం ఈవ్యాధి బారిన పడిన కుక్కులు చనిపోకున్నా వాటి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. దాదాపు ఆరు నెలల పాటు వైరస్ వాటి శరీరంపై ప్రభావం చూపుతుంది. పశు వైద్యశాలలకు మందుల సరఫరా లేక చికిత్స అందించే పరిస్థితి లేదని స్థానిక వైద్యులు చెబుతున్నారు.

కుక్కల  స్వైర విహారం

మండల పరిధిలోని పలు గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువవుతోంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరి పైనా దాడి చేస్తున్నాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీంతో మండల కేంద్రంతో పాటు, వివిధ గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువవుతోంది. గతంలో ఆయా గ్రామాలలో కుక్కలను బంధించి అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టడం వంటివి చేపట్టేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కుక్కల సంతతి సైతం పెరిగింది. కుక్కలు దాడులు చేస్తుండడంతో పలువురు గాయాలపాలై ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రహదారుల వెంట వెళ్లే ప్రజలు, మూగజీవాలు, పశువులపై కుక్కలు దాడులు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారిని వెంబడిస్తుండడంతో వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లేవారు కుక్కల బారిన పడి గాయాలపాలవుతున్నారు.

పిల్లలు, వృద్ధులకు ప్రమాదం

మా ఊరిలో చాలా రోజులుగా కుక్కల శరీరం మీద ఉన్న బొచ్చు ఊడిపోతుంది. రాలిపోయిన చోట పురుగులు ఉంటున్నాయి. ఆ కుక్కలను చూస్తే భయం వేస్తుంది. అవి నివాసాల్లోకి రావడంతో పిల్లలు, ముసలోల్లకు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
                   -మ్యాడ శ్రీనివాస్,తుంగుర్

చర్యలు తీసుకుంటాం

వీధి కుక్కలకు చర్మ సంబంధ రోగాలు వ్యాప్తి చెందిన మాటా వాస్తవమే. ఆ వ్యాధి నివారణకు డెర్మటైటిస్ ఐవర్మెక్టిన్ ఇంజక్షన్లను వారం రోజులపాటు ఇస్తే రోగ నివారణకు చర్యలు తీసుకోవచ్చు. వీధి కుక్కలకు ఇంజక్షన్ వేయాలంటే డాగ్ క్యాచర్లు అందుబాటులో ఉండాలి.
              – డా”జై సునీల్, పశువైద్యాధికారి, బీర్ పూర్ మండల్

 
నివారణ చర్యలకు హామీ

గ్రామంలో శునకాల బెడద నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటాము. సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ విషయాన్ని పై అధికారుల వరకు తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
             – రవి, బీర్ పూర్ గ్రామ కార్యదర్శి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News