హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడత నిధుల కోసం పోరాడి సాధించుకున్నామని
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే దళితుల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం నేరుగా భారీ ఆర్థిక సహాయం చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్‌గా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, దాదాపు 18,000 దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున గత ప్రభుత్వం ఆర్థిక సాయం అందించామన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళిత బంధుపై మౌనం వహించిందని, ఈ విషయంపై తాను నిరంతరం పోరాడినట్లు కౌశిక్ చెప్పారు. దళిత బంధు అమలుపై అసెంబ్లీలో, జిల్లా పరిషత్ సమావేశాల్ కలెక్టరేట్ సమావేశంలలో ప్రభుత్వ తీరును నిలదీశామన్నారు. దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న తనను అణచివేయాలని ప్రభుత్వం కుట్రపన్నిందని, కేసులు పెట్టి, కాంగ్రెస్ నాయకుల చేత దాడులు చేయించేందుకు ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధుపై తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్ఎస్, తన నిరంతర పోరాటం ఉందని అన్నారు. కేసీఆర్ తెచ్చిన చారిత్రాత్మక దళిత బంధును పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని లేదంటే, దళిత ద్రోహి పార్టీగా చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు.