కరీంనగర్ కొత్తపల్లి నందు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ7 ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కమిషనరేట్ కొరకు నూతనంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన భరోసా కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ ఆదివారంనాడు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర డీజీపీకి కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి పూల మొక్కతో స్వాగతం పలికారు.
అనంతరం భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నూతన భరోసా కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించారు. భరోసా కేంద్రంలో బాధిత మహిళలకు సేవలందించేందుకు గాను ఏర్పాటు చేయబడిన గదులు, వాటిలో వసతులు పరిశీలించారు.
ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ 1000 గజాల స్థలంలో, 6800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చాల అద్భుతంగా నిర్మించారన్నారు. కరీంనగర్ లోని భరోసా కేంద్రంలో సేవలు సోమవారం నుండి అందుబాటులోకి రానున్నాయన్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు, అసభ్యకరమైన లైంగిక ప్రవర్తనకు లోనైన పిల్లలకు పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూత అందించేందుకే తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్ జిల్లాల్లో ఈ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
బాధితులకు సేవలందించుటలో భరోసా కేంద్రాల ఏర్పాటు మంచి సత్ఫలితాలనిస్తుందన్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో శిక్షల శాతం పెరిగిందన్నారు. హైదరాబాద్ లో మొదట ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 27 జిల్లాల్లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ భరోసా కేంద్రంలలో బాధిత మహిళలకు మానసిక ప్రోత్సాహంతో పాటు, పోలీస్ సేవలు, అవసరమైన వైద్య సహాయం, న్యాయ సేవ, బాధితులకు సహాయ నిధి మొదలగు ఇతర సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సిటిజెన్ ఫీడ్ బ్యాక్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం వలన ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు వీలుంటుందన్నారు. ముఖ్యంగా మహిళల భద్రతే భరోసా ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డి ఐ జి రమా రాజేశ్వరి, ట్రైనీ ఐపీఎస్ యాదవ్ వసుంధర ఫౌరెబి, అడిషనల్ డీసీపీ లక్ష్మి నారాయణ , ఏసీపీ మాధవి , ఇన్స్పెక్టర్ శ్రీలత , ఎస్బిఐ బ్యాంకు అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.