తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలోని ఆరవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించి వారికి గణిత శాస్త్రాన్ని బోధించారు. పిల్లలతో మమేకమై వారిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిలబస్ గురించి కొన్ని ప్రశ్నలు వేస్తూ జవాబులు రాబట్టారు.
8వ తరగతి విద్యార్థులను సైన్స్ గురించి కొన్ని ప్రశ్నలను అడిగారు. విద్యార్థులు సరైన జవాబులు ఇవ్వడంతో ఉపాధ్యాయుల బోధన పట్ల కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో బోధన బాగుందని ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని, ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులను ఒప్పించేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, కిచెన్ గార్డెన్ పట్ల ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో విజయ్ కుమార్,ఎంఈఓ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు వెంకటరమణారావు ఉన్నారు.