Konda Murali Gandhi Bavan: తనను ఎవరూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని, చావుకు కూడా భయపడను అని కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ చేరుకున్న ఆయన పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఆరు పేజీల లేఖను కొండా మురళి అందజేశారు. అనంతరం కొండా మురళి గాంధీభవన్ బయట మీడియాతో మాట్లాడారు. అన్ని వివరాలు మల్లు రవికి చెప్పానన్నారు. కాంగ్రెస్ పెద్దలంటే తనకు గౌరవం అని చెప్పారు. రాహుల్‌ను ప్రధానిని చేయాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. తాను బీసీలకు న్యాయం చేసే పనిలోనే బిజీగా ఉంటానని కొండా మురళి అన్నారు. తనను ఎవరూ ప్రశ్నలు అడగలేదని, క్రమశిక్షణ కమిటీకి అన్ని వివరాలు తెలియజేశానన్నారు.
కాగా, ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బర్త్ డే వేడుకల్లో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి మాట్లాడిన మాటలు వరంగల్ కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. సొంత పార్టీ నేతలు, సీనియర్ నాయకులపై కొండా మురళి పరోక్షంగా విమర్శలు చేశారు. తమ లాగా దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన వాళ్లు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు పోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/ktr-warns-of-legal-action-against-those-who-false-campaign-phone-tapping-case/
టీడీపీ నుంచి వచ్చిన ఓ నాయకుడు అప్పుడు చంద్రబాబుని, మొన్న కేసీఆర్‌ను వెన్నుపోటు పొడిచారని కడియంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అలాంటి నాయకుడితో సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లిపై కూడా విమర్శలు గుప్పించారు. బీసీ నేతను అయినందుకే తనపై కక్ష కట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తాను ఉన్నంత వరకు మరో నాయకుడు ఎవరూ ఉండరని వార్నింగ్ ఇచ్చారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/big-twist-in-telugu-tv-anchor-swechha-case/
ఈ పరిణామం అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కొండా మురళికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సమావేశంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, బస్వరాజు సారయ్య, గండ్ర సత్యనారాయణ రావు, సుధారాణి హాజరయ్యారు. ఎవరైనా సరే నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. కులాన్ని అడ్డుపెట్టుకొని తమకు నచ్చినట్లుగా మాట్లాడుతామంటే కుదరదని తేల్చిచెప్పారు. ఇబ్బందులు ఏమైనా ఉంటే పార్టీ నాయకత్వానికి చెప్పుకోవాలని, అడ్డగోలుగా బహిరంగా మాట్లాడం ఏంటని మండిపడ్డారు. అయితే, ఇటీవల ఉమ్మడి వరంగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి కొండా మురళిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
