జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనప కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా లతో కలిసి వార్డులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైద్యులు చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది విదల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు. వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
మ్యాథ్స్ టీచర్ గా చాక్ పీస్ పట్టి
అనంతరం కాగజ్ నగర్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి తరగతి గదులు, వంటశాల, నూతన మెను పట్టికను పరిశీలించారు. వంట గదిలో సిబ్బంది పరిశుభ్రత పాటించాలని, నిత్యవసర సరుకులు, తాజా కూరగాయలు వంట సమయంలో వినియోగించాలని, సామాగ్రిని క్రమపద్ధతిలో అమర్చుకోవాలని తెలిపారు. విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని తెలిపారు. బాలికల స్నానపు గదులు, మూత్రశాలలు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. తరగతి గదులలో గణితం సబ్జెక్టులో విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని ప్రశ్నలు అడిగి పరీక్షించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నాణ్యమైన బోధన అందించాలని విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ కిరణ్ కుమార్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.