కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. రైతన్నల కష్టాలు వినేవారు లేరు,చూసేవారు లేరు అన్నట్లుగా ఉంది ఇక్కడికి పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను మార్కెట్లో అమ్మేందుకు పడే నరకయాతన రైతన్నలకే తెలుసు.

జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా సాగయ్యే పంటల్లో పత్తి పంట ఒకటి. ప్రైవేటులో పత్తిని అమ్మి మోసపోకుండా సీసీఐకి అమ్ముకుంటున్న రైతులకు ఈ ఏడాది చేదు అనుభవం ఎదురయింది. గత పదిరోజులకు పైగా రాయ్ టెల్ సర్వర్ పని చేయకపోవడంతో సిసిఐ అధికారులు పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. ఈ సర్వర్ ఇక పని చేస్తుందో లేదో అధికారులకే తెలియని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 18 జిన్నింగు మిల్లుల్లో రోజుకు సుమారుగా 15 లక్షల క్వింటాళ్ళకు పైగా అధికారులు పత్తి కొనుగోలు చేశారు. బ్యాంకుల్లో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిదీ ఆన్లైన్ వ్యవస్థ ఉన్నా పది రోజులుగా సర్వర్ పని చేయకపోవడంపై రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సర్వర్ పనిచేయకపోవటం ఏంటో!
పల్లెటూరు నుండి మొదలుకొని సిటీ వరకు ప్రతి ఒక్కరు డిజిటల్ వ్యవస్థ పైన ఆధారపడి ఉన్న ఈ రోజుల్లో సర్వర్ ఎందుకు పనిచేయదు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. లక్ష్యానికి మించి పత్తి కొనుగోలు జరగడంతో సీసీఐ అధికారులే సర్వర్ పేరుతో కొనుగోలు నిలిపివేశారని రైతన్నలు మండిపడుతున్నారు. చేసేది ఏమీ లేక క్వింటాలుకు 500 రూపాయల నుండి 1000 రూపాయల వరకు తేడాతో సరిహద్దులో ఉన్న మహారాష్ట్రకు వెళ్లి అక్కడ పత్తిని అమ్మేస్తున్నారు. సరైన ధర లేక జిల్లావ్యాప్తంగా ఎంతోమంది రైతులు వేల రూపాయలను నష్టపోతున్నారు.

“జిల్లా స్థాయి అధికారులతో పాటు సిసిఐ అధికారులను కూడా ప్రతిరోజు సంప్రదిస్తున్నాము. సర్వర్ ఎప్పుడు పని చేస్తుందో తెలియద”ని అధికారులను సంప్రదిస్తూనే ఉన్నామని అశ్వక్ జిల్లా మార్కెటింగ్ అధికారి వివరించారు.

సర్వర్ పనిచేయకపోవడంపై ఎన్నో అనుమానాలు
“పది రోజులకు పైగా సర్వర్ పని చేస్తలేదు. జిల్లా మొత్తం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సిసిఐ అధికారులు కావాలనే సర్వర్ బందు చేశారు, రైతులకు బాగా అన్యాయం జరుగుతోంది, మహారాష్ట్రకు వెళ్లి తక్కువ ధరకు పత్తి అమ్మేసుకుంటున్నారు. అధికారులు తొందరగా సర్వర్ పని చేసేలా చూడాలి” అంటూ మారుతి పటేల్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తెలుగుప్రభతో తమ గోడు వెళ్లగక్కారు.
