కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనీ ఉపాధి హామీ పథకంలో ఒకే అధికారి మండలంలో సుమారు పది సంవత్సరాలకు పైగా ఒకే చోట విధులు నిర్వహిస్తుండడం పట్ల సదరు అధికారిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఒకే చోట ఇన్నేళ్లుగా పాతుకుపోయిన ఆ అధికారి వ్యవస్థలో ఉన్న లొసుగులకు మసిపూస్తూ ఇష్టా రీతిగా వ్యవహరిస్తున్నాడని సదరు అధికారిపై ఆ కార్యాలయంలో పనిచేసే సిబ్బందే మండిపడుతున్నారు.
పదేళ్లలో కోట్ల రూపాయల పనులు
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకోకుండా ఇక్కడే పనులు కల్పించేందుకు 2006 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చెట్లు నాటడం, కందకాలు తీయడం, వాటర్ షెడ్లు, నీటి తొట్టెలు, పార్కులేషన్ ట్యాంకులు తదితర పనులు కొనసాగుతాయి. గత పది సంవత్సరాల నుండి మండలంలో కోట్ల రూపాయల పనులు జరిగాయి. జరిగే పనులలో ఎక్కడ ఎలా చేయాలో ఏ విధంగా నిధులను నొక్కేయాలో ఆ అధికారికి వెన్నతో పెట్టిన విద్య అని సదరు కార్యాలయంలో పనిచేసే సిబ్బందే చెప్పడం గమనార్హం.
ఆ అధికారుల అండదండలతోనే
ఒకే చోట ఈ అధికారి ఇన్నేళ్లుగా పాతుకుపోవడం పట్ల కొందరు ప్రజా ప్రతినిధులు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.వెనుకబడిన ఆదివాసి జిల్లాలో అడిగే వారు ఎవరు లేకపోవడంతో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగుతోంది. ఈ అధికారి ఇక్కడే పాతుకుపోవడం, జరిగే పనులల్లో చేతివాటం ప్రదర్శించడంతో కార్యాలయ సిబ్బంది సైతం పైకి కక్కలేక మింగలేక సతమతం అవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సదరు అధికారిని ఈ మండలం నుండి బదిలీ చేయాలని సంబంధిత కార్యాలయ సిబ్బంది కోరుతున్నారు.