Nagar Kurnool Govt Hospital: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ఓ వైద్యురాలు ఆన్‌లైన్ గేమ్‌లో మునిగిపోయింది. అది కూడా ఐసీయూ వార్డులో.. నిత్యం వందలామంది పేద ప్రజలు అనారోగ్యంతో సర్కారు ఆస్పత్రికి వస్తుంటారు. అలాంటి వారికి వైద్యం అందించాల్సిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. కలెక్టర్లు నిత్యం ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శిస్తూ మెరుగైన సేవలు అందించాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసినా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రి ఐసీయూ వార్డులో నిన్న ఓ వైద్యరాలు తన మొబైల్ ఫోన్లో క్యాండీ క్రస్ గేమ్ ఆడడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ALSO READ: https://teluguprabha.net/telangana-district-news/purnachandra-wife-swapna-reacts-anchor-swetcha-daughter-comments/
వివిధ రోగాల బారిన పడి అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, విధి నిర్వహణలో ఉంటూ తన స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ తన వృత్తి ధర్మాన్ని విస్మరించిన వైద్యురాలి ఘటన శనివారం రాత్రి స్థానిక జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అక్కడే ఉన్న కొంతమంది రోగుల బంధువులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్డడంతో పట్టణంలో ఆదివారం హల్‌చల్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో శనివారం రాత్రి సుమారు 8:40గంటల ప్రాంతంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వివిధ సమస్యలతో రోగులు వైద్యం కోసం రాగా ఈ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు మహిళ వైద్యులు వైద్యం అందిస్తుండగా మరో వైద్యురాలు తన స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ లీనమైపోయింది.
ALSO READ: https://teluguprabha.net/national-news/jharkhand-floods-locals-rescue-162-students/
అత్యవసర విభాగంలో కొంతమంది రోగులు క్యూ లైన్‌లో ఉన్నప్పటికీ సెక్యూరిటీ గార్డు ద్వారా రోగులను బయట నిలిపి తాను మాత్రం కాలక్షేపం చేస్తూ ఉండిపోయింది. ఇదే సమయంలో క్యూ లైన్‌లో ఉన్న రోగుల బంధువు ఒకరు వైద్యురాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ కనిపించిన తతంగాన్ని స్మార్ట్ ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. రాష్ట్ర ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్, కలెక్టర్ బాదావత్ సంతోష్ తనిఖీ చేసి విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన రోజే జిల్లా ఆస్పత్రిలో ఈ విధమైన నిర్లక్ష్యం కనిపించడం విశేషం. అత్యవసర విభాగంలో విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలు తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘు ఆదివారం సంబంధిత డాక్టర్ అయేషాకు మెమో జారీ చేశారు. డాక్టర్ ఇచ్చిన వివరణను బట్టి చర్య తీసుకుంటామని తెలిపారు.