విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ చూపుతారని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్, కాస్మోటిక్స్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్బంగా జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మ పేటలో తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు. పాఠశాల, జూనియర్ కళాశాలలోని తరగతి గదులను, పరిసరాలను, వంట గదిని, స్టోర్ రూంలో బియ్యం, కూరగాయలను, సరుకులను పరిశీలించారు. 10వ తరగతి, సెక్షన్ ఏ, 5వ తరగతి సెక్షన్ ఏ,బి లలో చదువుతున్న విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. ఇంగ్లీష్ తదితర పాఠ్యాంశాలను చదివించారు. పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలు, బోధన, ఆహారం నాణ్యత గురించి విద్యార్థులతో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో భోజనం రుచిగా నాణ్యతతో అందిస్తున్నట్లు, ఉపాద్యాయులు బోధన గురించి బాగా ఉందని తెలిపారు. విద్యార్థినులు ఇంగ్లీష్ లో కష్టమైన పదాలను రాసుకుని అర్థం తెలుసుకుంటే బాగా అర్థం అయి గుర్తుండి పోతాయని అన్నారు.
వచ్చే పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని, అందుకు తగ్గట్లుగా కష్టంతో ఇష్ట పడి చదవాలని, పూర్తి సిలబస్ పట్ల పట్టు తెచ్చుకోవాలని, నిత్యం ప్రతి సబ్జెక్టును సాధన చేయాలని, ఉత్తమ మార్కులు వచ్చేలా కృషి చేయాలని, ఎంచుకున్న లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని, జీవితంలో ఉన్నత విలువలతో కూడిన లక్ష్యాలను ఛేదించాలని కలెక్టర్ సూచించారు. సైన్స్ ల్యాబ్ అండ్ లైబ్రరీ ని సందర్శించారు. లైబ్రరీలో ఉన్న స్టోరీ పుస్తకాలు చదివేందుకు విద్యార్థినులకు అందించాలని అన్నారు. కంప్యూటర్ ల ఇన్ స్టాలేషన్, ఇన్సులేటర్ లు, శానిటరీ నాప్కిన్స్ అవసరం ఉందని ప్రిన్సిపాల్ తెలుపగా ప్రతిపాదనలు సమర్పించాలని సూపర్ వైజర్ అధికారి జోజప్పకు కలెక్టర్ సూచించారు.
పెంచిన కొత్త డైట్ మెనూ బోర్డును విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే ఎస్ఓపీ హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చదువుతో విద్యార్థులు ఆరోగ్యాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించడమే ధ్యేయంగా 8 ఏళ్ల తర్వాత డైట్ చార్జీలు 40 శాతం, 16 ఏళ్ల తర్వాత కాస్మోటిక్స్ చార్జీల 200 శాతం ప్రభుత్వం పెంచడం జరిగిందని, అన్ని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో, కె.జి.బి.వి.లో నూతన మెనూ అమలు ప్రారంభం చేసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 87 గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో డైట్ చార్జీలు పెంపు, కామన్ మెనూ అమలు ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు. మంచి ఆహారం అందిస్తేనే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని, దీంతో చదువు మీద మరింత ఆసక్తి కలుగుతుందని, ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచి, విద్యార్థుల ఇష్టాలకు తగ్గట్లుగా కొత్త మెనూని రూపొందించిందని పేర్కొన్నారు. ఏ వారం ఏమి అందించాలి మెనూలో పేర్కొన్నట్లు తెలిపారు. అన్ని పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారు ఆహారం నాణ్యత ముందుగానే పరిశీలిస్తారని తెలిపారు. విద్యార్థినులు కూడా మెస్ లీడర్ లు ఆహారం నాణ్యత రుచి చూసి ఏమైనా లోపాలు ఉంటే ప్రిన్సిపాల్, అధికారుల దృష్టికి తీసుకు రావాలని అన్నారు.
అన్ని సౌకర్యాలను ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తోందని, వచ్చే అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, , ఈసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించేందుకు క్రీడా స్టేడియం ఇతర సౌర్యాలతో జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గంలో బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో, దేవరకద్ర నియోజకవర్గం సి.సి.కుంట మండలం దమగ్నపూర్ లో శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యార్థినిలు, తల్లి దండ్రులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. అంతకు ముందు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, చదువు ప్రాధాన్యతపై స్కిట్, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కల్పన, సూపర్ వైజర్ అధికారి జోజప్ప, స్థానిక కౌన్సిలర్ జ్యోతి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.