కొత్త సంవత్సరం వేడుకలు బుధవారం జడ్చర్ల మండల పరిధిలో అంబరాన్నంటాయి. కోటి ఆశలతో కొత్త సంవత్సరం 2025 ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. యువత, మహిళలు కేకులు కోసి సంబురంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.
వేకువ జాము నుంచే మహిళలు తమ ఇళ్ళ ముందు కళ్లాపి చల్లి, రంగురంగుల రంగవల్లులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కావేరమ్మపేట శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత ఆలయంలో కొత్త సంవత్సరం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్కులు, ఇతరత్రా సందర్శనీయ ప్రాంతాలు పర్యాటకులతో సందడిగా మారాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఏడాది అంతా శుభమే కలగాలని ఆకాంక్షించారు.