KCR| బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో సందడిగా గడుపుతున్నారు. శనివారం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ నేతలతో ఆయన సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కేసీఆర్ సరదాగా ముచ్చిటించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్వయంగా కారు నడిపారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని కారు నడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ గులాబీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలో ఓమినీ వాహనాన్ని కేసీఆర్ నడిపిన సంగతి తెలిసిందే.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన విషయం విధితమే. కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయిందని.. కానీ ప్రజలకు ఏం చేయలేదని విమర్శించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది సేవ చేయడానికే కానీ ప్రతిపక్ష నేతలకు ఇష్టమొచ్చినట్లు తిట్టడానికి కాదన్నారు. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి కానీ కూలగొడతామంటూ భయపెడతారా..? అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు.. నిర్మించడానికి అన్నారు. వచ్చే ఎన్నికల్లో మనదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేసారు. ఇప్పుడు ప్రజలు మనపై నమ్మకంతో ఉన్నారని.. పార్టీ నాయకులూ అందరూ కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. అరెస్టులకు అసలు భయపడేది లేదని పేర్కొన్నారు.