Sammakka Saralamma: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మల మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. 2026 జనవరి 28 నుంచి 31వరకు నాలుగు రోజుల పాటు మహా జాతర జరగనుందని పేర్కొన్నారు. జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గుట్టకు చేరుకుంటారు. 29వ తేదీన సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెకు చేరుకోనుంది. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని పూజారుల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో మహా జాతర జరగనుంది. జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని పూజారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
జాతర విశిష్టత:
సమ్మక్క, సారలమ్మల మహాజాతర గిరిజన సంస్కృతి, సంప్రదాలకు, ఆచారాలకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘమాసంలో పౌర్ణమి రోజున ఈ జాతరను నిర్వహిస్తారు. 2014లో తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం తరువాత ప్రభుత్వం మేడారం మహాజాతరను రాష్ర్ట పండుగగా అధికారికంగా ప్రకటించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో మేడారం జరుగుతుంది. మొదట్లో చిలుకల గుట్టపై జాతర నిర్వహించేవాళ్లు. అయితే, ప్రతి ఏటా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండడంతో గుట్ట కింద ప్రస్తుతం జాతర నిర్వహిస్తున్నారు. గతంలో ఇది వరంగ్ జిల్లాలో ఉండగా కొత్త జిల్లా ఏర్పాటుతో ములుగు జిల్లాలోకి చేరింది. సమ్మక్క, సారక్కప్రజల కోసం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వారి పోరాటానికి గుర్తుగా గిరిజనులు ఈ మహాజాతరను జరుపుకుంటారు. వంశపారం పర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. ఇక్కడి సమ్మక్క, సారలమ్మలు వనదేవతలుగా పూజలందుకుంటున్నారు. ఇక్కడ జంపన్న వాగులో భక్తులు పవిత్ర స్నానం చేసి, తమలైన కోరికలు తీర్చమని వన దేవతలను వేడుకుంటారు. భక్తులు తమ బరువుకు సమానమైన బంగారాన్ని(బెల్లం) దేవతలకు సమర్పిస్తారు. ఇక్కడ బెల్లంను బంగారంతో పోల్చుతారు. ఇది శుద్ధి చేయని చక్కెర రకం బెల్లం. ఇది శ్రేయస్సు, స్వచ్ఛతను సూచిస్తుందని తీపితో సమ్మక్కసారలమ్మలకు భక్తులు నైవేద్యంగా సమర్పిస్తారు. గిరిజనుల సంప్రదాయ జానపద నృత్యం అయిన గట్కా నృత్యం ఇక్కడి పండుగలో ప్రధాన వేదికగా నిలుస్తుంది. మహా జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీష్‌గఢ్, ఒడిస్సా, మహారాష్ర్ట, కర్ణాటక, కేరళ, ఆసియాలోని ఇతర ప్రాంతాల గిరిజన తెగలు, అన్నిమతాల వారు సుమారు కోటిమందికి పైగా హాజరవుతారు. ప్రభుత్వం భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చింది.
నాలుగు రోజుల జన జాతర:
మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతర నాలుగు రోజుల పాటు అంగరంగా వైభవంగా జరుగుతుంది. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ఈ జాతర తెలియజేస్తుంది. జాతర తొలి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. రెండో రోజు చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడో రోజున అమ్మవార్లు ఇద్దరూ గద్దెలపై కొలుదీరుతారు. నాలుగో రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి వనప్రవేశం చేయిస్తారు.
ఎవరీ సమ్మక్క, సారలమ్మ?
రెండేళ్లకు ఒకసారి మేడారం జాతరను ప్రభుత్వం, గిరిజన తెగలు ఎందుకు అంత ఘనంగా నిర్వహిస్తారు? మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది? వన దేవతలుగా కొలిచే సమ్మక్క, సారలమ్మ ఎవరు? సంపెంగవాగు ఎందుకు రక్తపుఏరుగా మారింది? జంపన్న వాగు విశిష్టత ఏంటి? మేడారం మహా జాతర వెనుక ఉన్న చరిత్రను ఒక్కసారి తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకు వెళ్లాడు. ఆయనకు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ పాప కనిపించింది. ఆ పాపకే సమ్మక్క అని నామకరణం చేశాడు. అయితే, సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించినప్పుడు ఆమె చుట్టూ సింహాలు, పులులు రక్షణగా ఉన్నాయి. ఈ దృష్యాన్ని చూసిన మేడరాజు ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా ఉండేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలిచేవారు. సమ్మక్క మంచి హస్తవాసి. వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేస్తూ ఉండేది. సమ్మక్క చేత్తో ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదని ప్రశస్తి.
సమ్మక్కను మేడరాజు అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయత రాజు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తగా మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు రాజ్యానికి పారిపోతాడు. అయితే పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉండేవాడు. కరువు వల్ల కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మామకు ఆశ్రయం కల్పించడం, ప్రజల్లో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడని మాఘ శుద్ధ పౌర్ణమిన ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తుతాడు.
యుద్ధంలో పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించారు. రణభూమిలో వీరు వీరోచితంగా పోరాటం చేస్తారు. అయితే అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక సారలమ్మ, నాగులమ్మ, మేడరాజు, పగిడిద్దరాజు, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. ఈ వార్త విన్న సమ్మక్క కుమారుడు జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.
సమ్మక్క యుద్ధ భూమిలో కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతూ వీరోచిత పోరాటం చేసింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్యపోయాడు. శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు మడుగులో యుద్ధ భూమి నుంచి చిలుక గుట్టవైపు వెళ్తూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు ఉన్న భరిణె లభించింది. ఆ భరిణెను సమ్మక్కగా భావించిన నాటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘమాసంలో పౌర్ణమి రోజున సమ్మక్క, సారలమ్మల జాతరను అత్యంత వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.