నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పీఏ పల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో వందలాది కోళ్లు మృతి చెంది కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది.
శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు రిజర్వాయర్ లో చనిపోయిన కోళ్లను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. బర్డ్ ఫ్లూ సోకిన కారణంగానే గుర్తుతెలియని వ్యక్తులు కోళ్లను రిజర్వాయర్ లో పడవేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. అక్కంపల్లి రిజర్వాయర్ నుండే హైదరాబాదు జంట నగరాలకు, నల్గొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు నిత్యం త్రాగునీరు సరఫరా అవుతుండడంతో ప్రజలు తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు.

ఆందోళన వద్దు
విషయం తెలుసుకున్న దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, ఇరిగేషన్, రెవెన్యూ, వెటర్నరీ, పోలీస్ అధికారులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి, రిజర్వాయర్ వెనుక జలాల్లో దాదాపుగా 80 చనిపోయిన కోళ్లు లభ్యమైనట్టు వారు తెలిపారు. రిజర్వాయర్ లో కోళ్లను ఎవరు పడేసి ఉంటారని కోణంపై విచారణ చేపడుతున్నట్టు తెలిపారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరీక్షల నిమిత్తం కోళ్లను ల్యాబ్ పంపించినట్టుగా ఆర్డీవో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు.
